 
															ఎట్టకేలకు రంగం సిద్ధం
● చేప పిల్లల పంపిణీకి నేడు శ్రీకారం ● జిల్లాలోని 650 చెరువుల్లో 1.76 కోట్ల పిల్లలు 
పాల్వంచరూరల్ : చెరువుల్లో చేప పిల్లల పంపిణీకి ఎట్టకేలకు రంగం సిద్ధమైంది. జిల్లాలోని 650 చెరువుల్లో 1.76 కోట్ల పిల్లలు పోసే ప్రక్రియకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
టెండర్లు ముగిసినా.. జాప్యం
చేపపిల్లల కొనుగోళ్ల టెండర్ల ప్రక్రియ సెప్టెంబర్ రెండోవారంలోనే ముగిసింది. అయితే స్థానిక సంస్ధల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ ప్రక్రియకు కొంతకాలం బ్రేక్ పడింది. ఎట్టకేలకు నేటి నుంచి పిల్లల సరఫరా చేపడుతున్నారు. జిల్లాలోని 734 చెరువుల్లో పిల్లలు వదలాల్సి ఉండగా సమయాభావం పేరుతో 650 చెరువుల్లో మాత్రమే పోసేందుకు చర్యలు చేపడుతున్నారు. నీటినిల్వ సామర్థ్యం, విస్తీర్ణం ఆధారంగా చిన్న, పెద్ద సైజు పిల్లలను పంపిణీ చేయనున్నారు. 80–100మి.మీ.సైజు గల 86 లక్షల పిల్లలు రూ.1.49 పైసల చొప్పున సరఫరాకు ఒప్పందం కుదిరింది. గతేడాది ఇదే సైజు పిల్లలు రూ.1.79 పైసల చొప్పున పంపిణీ చేశారు. ఇక 35 – 40 మి.మీ. సైజ్ పిల్లలు 90 లక్షలు పోయనుండగా రూ.0.56 పైసల చొప్పున పంపిణీకి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. గతేడాది ఈ సైజు పిల్లలకు రూ.0.60 పైసల చొప్పున సరఫరా చేశారు. అయితే సాధారణంగా జూలైలో టెండర్లు ఆహ్వానించి ఆగస్టులో చేపపిల్లలు పోస్తారు. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపులో జాప్యం జరగడంతో సెప్టెంబర్ రెండో వారంలో టెండర్లు ఖరారైనా ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో పంపిణీ ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కొందరు మత్స్యకారులు సొంత డబ్బులతో పిల్లలను కొనుగోలు చేసి చెరువులు, కుంటల్లో పోసుకున్నారు.
ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని సుజాతనగర్ మండలం సింగభూపాలెం చెరువులో శుక్రవారం ప్రారంభిస్తున్నాం. ఈ చెరువులో శీలావతి, రవ్వ, బొచ్చ రకాలకు చెందిన లక్ష పిల్ల లను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నాం. ఆ తర్వాత జిల్లాలోని ఇతర చెరువుల్లో 1.76 కోట్ల చేప పిల్లలు విడుదల చేస్తాం.
– ఎండీ.ఇంతియాజ్‌ఖాన్, జిల్లా మత్స్యశాఖాధికారి
 
							ఎట్టకేలకు రంగం సిద్ధం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
