 
															● రక్షణ కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రేమజంట ● యువతి
పోలీసులపై దాడికి యత్నం
జూలూరుపాడు: జూలూరుపాడు ఠాణాలో గురువారం పోలీసులపై దాడికి యత్నం జరిగింది. ప్రేమజంట రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. మండలంలోని అన్నారుపాడుకు చెందిన యువతి గంగ, జూలూరుపాడుకు చెందిన అఖిల్ ప్రేమ వివాహం చేసుకుని రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించారు. కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని యువతి తల్లిదండ్రులు, బంధువులు గురువారం రాత్రి పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. యువతి కనిపించడంలేదని వారం రోజుల క్రితం ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ సుమారు మూడు వందల మంది బంధువులు ఆందోళనకు దిగారు. యువతీ, యువకులు ఇద్దరూ మేజర్లు కావడంతో ప్రేమ జంటకు ఆశ్రయం కల్పించామని పోలీసులు ఆందోళనకారులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు, బంధువులు వినిపించుకోకుండా ఒక్కసారిగా పోలీస్‌స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లారు. కుమార్తెను అప్పగించాలని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తోపులాట జరగ్గా, యువతి తల్లి స్పృహ కోల్పోయింది. దీంతో రెచ్చిపోయిన బంధువులు పోలీసులపైకి చెప్పులు విసరడంతోపాటు, దాడికి యత్నించారు. ఎస్‌ఐ బాదావత్ రవి అప్రమత్తమై ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్ సిబ్బందితో చేరుకుని ఆందోళనకారులను పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వెళ్లగొట్టారు. పరిస్థితిని అదుపు చేశారు. పోలీస్‌స్టేషన్‌పై దాడికి యత్నించిన, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినవారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లు, చండ్రుగొండ ఎస్‌ఐ శివరామక్రిష్ణ, సుజాతనగర్ ఎస్‌ఐ రమాదేవి, చుంచుపల్లి ఎస్‌ఐ ఉమా, లక్ష్మీదేవీపల్లి ఎస్‌ఐ రమణారెడ్డి, త్రీటౌన్ ఎస్‌ఐ శివప్రసాద్, పోలీస్ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కాగా యువతి డిగ్రీ చదువుతుండగా, యువకుడు పీజీ చేస్తున్నట్లు తెలిసింది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
