నేలవాలిన ఆశలు | - | Sakshi
Sakshi News home page

నేలవాలిన ఆశలు

Oct 30 2025 7:57 AM | Updated on Oct 30 2025 7:57 AM

నేలవా

నేలవాలిన ఆశలు

మూతబడిన పాఠశాలలు

అధిక వర్షపాతం నమోదు

చేతికొచ్చే దశలో పత్తి, వరి పంటలకు దెబ్బ

ఆందోళనలో అన్నదాతలు

ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

పొంగి పొర్లుతున్న వాగులు, రాకపోకలకు అంతరాయం

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/బూర్గంపాడు: అన్నదాతల ఆశలపై మోంథా తుపాన్‌ నీళ్లు చల్లింది. ఎంతో ఆశతో రూ.లక్షలు పెట్టుబడి పెట్టి పండించిన పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి. తుపాన్‌ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా బుధవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా.. పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. చేతికందే దశలో ఉన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం జిల్లాలో ఈ వానాకాలంలో 2,21,345 లక్షల ఎకరాల్లో పత్తి, 1,72,625 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు పంటలూ కోతకు సిద్ధమవుతున్న తరుణంలోనే తుపాన్‌ విరుచుకుపడి రైతులను నట్టేట ముంచింది.

దిగుబడి తగ్గి.. రంగు మారి..

మోంథా తుపాన్‌ ప్రభావంతో బలమైన గాలులు వీయగా వరి నేలవాలింది. వర్షంతో పొలాల్లో నీరు నిలిచి వరి పంట దెబ్బతిన్నది. పత్తిలో వర్షపునీరు చేరడంతో నల్లబారే ప్రమాదంతో పాటు దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కూడా కోతదశలో ఉండగా కంకులు నానడంతో ధాన్యం రంగు మారుతుందని అంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల వరి కోయగా.. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదని, తక్కువ ధరకే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ఇక దిగువ ప్రాంతాల్లోని వరి పొలాలను వర్షపు నీరు ముంచెత్తడంతో మొలకలు వచ్చే ప్రమాదం ఉంది. పైరు నేలవాలడంతో హార్వెస్టర్లతో కోసే అవకాశం లేకుండా పోతోంది. పత్తి కాయలు పగిలి, దూది బయటకు వస్తున్న తరుణంలో భారీ వర్షాలు కురవడంతో దూది పూర్తిగా తడిసిపోయింది. రంగు మారి నాణ్యత తగ్గింది. రంగు మారిన పత్తికి మార్కెట్‌లో డిమాండ్‌ ఉండదు. ఇప్పటికే సీసీఐ విధించిన నిబంధనలతో సతమతమం అవుతుండగా ‘తెల్ల బంగారం’ సాగు చేసిన రైతులకు తుపాన్‌ ప్రభావంతో మరింత నష్టం వాటిల్లనుంది.

అప్పుల ఊబిలో అన్నదాత..

సాగు చేసింది మొదలు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల రూపంలో రూ.లక్షలు అప్పు చేసి పంట పండించిన రైతులు తుపాన్‌తో తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఇప్పటికే వ్యవసాయ కమిషనరేట్‌ నుంచి జిల్లా వ్యవసాయాధికారులకు ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన పత్తి, వరి విస్తీర్ణాన్ని అంచనా వేయాలని, నష్టపోయిన ప్రతీ రైతుకు పరిహారం అందించాలని వేడుకుంటున్నారు. రంగు మారిన, తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని అంటున్నారు.

కొత్తగూడెంఅర్బన్‌: తుపాన్‌ కారణంగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాలు జారీ చేయగా.. బడులన్నీ మూసివేశారు. అయితే గురువారం కొనసాగుతాయా, సెలవు ఉంటుందా అనేది వెల్లడి కాలేదు.

ఈ ఏడాది జూన్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే 31 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. బుధవారం జిల్లాలో సరాసరి వర్షపాతం 13.4 మి.మీ.గా నమోదైంది. జిల్లాలో ఈ సీజన్‌లో ఐదు మండలాల్లో సాధారణ, 18 మండలాల్లో అధికంగా వర్షం కురిసింది.

మోంథా తుపాన్‌తో జిల్లా రైతులకు తీవ్ర నష్టం

నేలవాలిన ఆశలు1
1/2

నేలవాలిన ఆశలు

నేలవాలిన ఆశలు2
2/2

నేలవాలిన ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement