కమనీయంగా రామయ్య కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కమనీయంగా రామయ్య కల్యాణం

Oct 30 2025 7:57 AM | Updated on Oct 30 2025 7:57 AM

కమనీయ

కమనీయంగా రామయ్య కల్యాణం

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకల్యాణ వేడుక బుధవారం కమనీయంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

డీపీఓగా బాధ్యతల స్వీకరణ

చుంచుపల్లి: జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)గా నియమితులైన బొప్పన అనూష బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డీపీఓగా పనిచేస్తున్న టి.రాంబాబును హైదరాబాద్‌ కమిషనర్‌ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నూతన డీపీఓగా బాధ్యతలు స్వీకరించిన అనూషను కార్యాలయ సిబ్బంది, ఎంపీఓలు, గ్రామ కార్యదర్శులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. అనూష స్వస్థలం ఖమ్మం కాగా, ఆమె తొలి పోస్టింగ్‌ జిల్లాకు కేటాయించారు.

‘డీఎంఎల్‌టీ’ దరఖాస్తు గడువు పొడిగింపు

చుంచుపల్లి: 2025 – 26 విద్యాసంవత్సరానికి గానూ కొత్తగూడెం వైద్య కళాశాలలో డీఎంఎల్‌టీ 30, డయాలసిస్‌ టెక్నీషియన్‌ 30 సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబర్‌ 27 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం.హరిరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌(బైపీసీ) పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

లక్ష్మీదేవిపల్లిలో హాకీ స్టేడియం

కొత్తగూడెంటౌన్‌: లక్ష్మీదేవిపల్లి మండలంలోని శ్రీరామచంద్ర డిగ్రీ కళాశాల వెనుక హాకీ స్టేడియం నిర్మించనున్నట్లు డీవైఎస్‌ఓ ఎం.పరంధామరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ స్థలంలోని వివిధ రకాల 78 వృక్షాల తొలగింపునకు అటవీ శాఖ నుంచి అనుమతి తీసుకున్నామని, అవసరమైన రుసుము కూడా చెల్లించామని పేర్కొన్నారు. చెట్లను కొనాలనుకునే వారు నవంబర్‌ 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు జరిగే వేలంలో పాల్గొనాలని కోరారు.

పలు రూట్లలో

బస్సుల రద్దు

ఖమ్మంమయూరిసెంటర్‌: తుపాను ప్రభావంతో ఖమ్మం రీజియన్‌ పరిధిలో పలు మార్గాలకు ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. రీజియన్‌ పరిధి ఏడు డిపోల నుంచి 128 బస్సులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. పలుచోట్ల రహదారులపైకి వరద చేరడంతో ముందు జాగ్రత్తగా ఖమ్మం నుంచి మహబూబాబాద్‌, వరంగల్‌ రూట్లలో బస్సులు నడిపించలేదు. ఖమ్మంతోపాటు మధిర, సత్తుపల్లి, భద్రాచలం, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు డిపోల నుంచి వివిధ మార్గాల్లో బుధవారం ఒకేరోజు 60,872 కి.మీ. మేర సర్వీసులు రద్దయ్యాయి. అత్యధికంగా సత్తుపల్లి డిపో నుంచి 35, భద్రాచలం డిపో నుంచి 25, ఖమ్మం నుంచి 22, కొత్తగూడెం నుంచి 15, ఇల్లెందు నుంచి 11, మధిర, మణుగూరు నుంచి పదేసి సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

కమనీయంగా  రామయ్య కల్యాణం1
1/1

కమనీయంగా రామయ్య కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement