 
															థర్మల్ విద్యుత్‌కు తగ్గిన డిమాండ్
కేటీపీఎస్, బీటీపీఎస్‌లో
పలు యూనిట్లు రిజర్వ్ షట్‌డౌన్
పాల్వంచ: ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా తగ్గింది. మరోవైపు జల, సోలార్ విద్యుత్ అధిక వినియోగంతో థర్మల్ విద్యుత్‌పై ప్రభావం పడింది. జిల్లాలోని కేటీపీఎస్, బీటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బుధవారం చాలా వరకు యూనిట్లను రిజర్వ్ షట్‌డౌన్‌లో ఉంచారు.
జెన్‌కోకు భారీ నష్టం..
విద్యుత్ డిమాండ్ లేకపోవడం, థర్మల్ విద్యుత్ ధర అధికంగా ఉన్న నేపథ్యంలో తక్కువ ధరకు లభించే జల, సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కేటీపీఎస్ 7వ దశలో 800 మెగావాట్లు, 5, 6 దశల్లోని 9వ యూనిట్ 250 మెగావాట్లు, 11వ యూనిట్ 500 మెగావాట్లు రిజర్వ్ షట్‌డౌన్‌లో ఉంచారు. ప్రస్తుతం పదో యూనిట్‌లోని 250 మెగావాట్లు మాత్రమే నడుస్తోంది. మణుగూరు బీటీపీఎస్‌లో నాలుగు యూనిట్లకు గాను 270 మెగావాట్ల 3వ యూనిట్ మాత్రమే విద్యుదుత్పత్తి చేస్తోంది. మిగిలిన 1, 2, 4 యూనిట్లను రిజర్వ్ షట్‌డౌన్‌లో ఉంచారు. మొత్తంగా అక్కడ 810 మెగావాట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో జెన్‌కో సంస్థకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ఈ విషయమై 5, 6 దశల సీఈ ఎం.ప్రభాకర్ రావును వివరణ కోరగా డిమాండ్ లేకపోవడం, సోలార్, జల విద్యుత్‌నే అధికంగా వియోగిస్తుండడంతో పలు యూనిట్లు రిజర్వ్ షట్‌డౌన్‌లో ఉన్నాయని చెప్పారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
