 
															శతవసంతాల సభకు దండుగా కదలాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే సీపీఐ శత వసంతాల ముగింపు సభకు ప్రతీ పల్లె, బస్తీ నుంచి దండుగా కదలాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో అయన మాట్లాడారు. సీపీఐ శత వసంత ఉత్సవాలు పార్టీ వేడుకలా కాకుండా, ప్రజల ఉద్యమ చరిత్రను గుర్తు చేసేలా ఉండాలని అన్నారు. ప్రజల హక్కులు, సామాజిక న్యాయం కోసం పోరాడిన సీపీఐ చరిత్ర నేటి తరానికి ఆదర్శంగా ఉండేలా మండల, గ్రామ స్థాయిలో ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషా మాట్లాడుతూ డిసెంబర్ 26 వరకు పార్టీ శ్రేణులు ప్రజాక్షేత్రంలోనే ఉంటూ ప్రచారాన్ని విస్తృతం చేయాలని కోరారు. కార్మికులు, కూలీలు, రైతులు, ఉద్యోగులు, యువత, మహిళల సమస్యలపై విస్తృత చర్చలు, సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో నాయకులు మర్రి గోపీకృష్ణ, మాచర్ల శ్రీనివాస్, కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, వంగా వెంకట్, గెద్దాడు నగేష్, రమణమూర్తి, నేరెళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
