 
															రైతుల సంక్షేమంలో కేవీకేల పాత్ర కీలకం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతు సంక్షేమానికి కృషి విజ్ఞాన కేంద్రాల పాత్ర కీలకమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని కేవీకేను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. కేంద్రంలోని పరిశోధన, శిక్షణ, రైతు అవగాహన కార్యక్రమాలపై శాస్త్రవేత్తలతో చర్చించి, రైతుల సంక్షేమానికి కేవీకే చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా పట్టుపురుగుల పెంపకం, విప్పపువ్వు సాగు, సమగ్ర వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత గిరిజన రైతులకు టార్పాలిన్లు, వ్యవసాయ సామగ్రిని అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ హేమ శరత్ చంద్ర, బి.శివ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణాభివృద్ధికి కృషి..
జిల్లాలో పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగంగా భారత్ రూరల్ లైవ్లీ హుడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ పాటిల్ తెలిపారు. మంగళవారం రాత్రి ఐటీడీఏ పీఓ రాహుల్‌తో కలిసి భారత్ లైవ్లీహుడ్ సంస్థ ప్రతినిధులు, జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్‌ఎల్‌ఎఫ్ సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ఈ మేరకు జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం, కరకగూడెం మండలాలను ఎంపిక చేయగా, అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపడామని వివరించారు. సంస్థ తాత్కాలిక కార్యాలయాన్ని భద్రాచలం ఐటీడీఏలో ఏర్పాటు చేశామని, అక్కడి నుంచే కార్యకలాపాలు సాగుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి ఆర్థిక సహకారం అందుతుందని వెల్లడించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఏపీఓ జనరల్ డేవిడ్ రాజు, డీఏఓ బాబూరావు, ఉద్యానవన అధికారి కిషోర్, ఎల్‌డీఎం రామిరెడ్డి, పశుసంవర్థక శాఖాధికారి వెంకటేశ్వర్లు, బీఆర్‌ఎల్‌ఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
చదువుతోనే ఉజ్వల భవిష్యత్..
చదువుతోనే ఉజ్వల భవిష్యత్ అనే సందేశం ప్రతీ విద్యార్థికి చేరాలని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు, ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పనుల్లో నాణ్యత పాటించేలా ప్రిన్సిపాళ్లు పర్యవేక్షించాలని సూచించారు. కళాశాలల్లో అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. అశ్వారావుపేట, చర్ల, పినపాక, దుమ్ముగూడెం కళాశాలల్లో ప్రవేశాలు ఎందుకు తగ్గాయని ఆయా ప్రిన్సిపాళ్లను అడిగి తెలుసుకున్నారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో సదుపాయాలు కల్పిస్తున్నామని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆదేశించారు. కళాశాలలకు బస్సు సౌకర్యం కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని ప్రిన్సిపాళ్లు చెప్పగా ఆ మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. సమావేశంలో డీఐఈఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సదరం క్యాంపు పరిశీలన
చుంచుపల్లి: కొత్తగూడెం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిర్వహిస్తున్న సదరం క్యాంపును కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు, సేవల లభ్యతను, నిర్ధారణకు ఉపయోగిస్తున్న పరికరాల పనితీరుపై సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, ప్రతీ దివ్యాంగుడికి అవసరమైన గుర్తింపు సర్టిఫికేషన్ అందేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డులు తెలంగాణతో పాటు దేశమంతటా పని చేస్తాయని చెప్పారు. ఈ కార్డుల ద్వారా దివ్యాంగులు ఆరోగ్య, విద్య, ఉపాధి, రవాణా రంగాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చని వివరించారు.
సూపర్‌బజార్(కొత్తగూడెం)/భద్రాచలం : తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా రాబోయే రెండు రోజుల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ వేర్వేరు ప్రకటనల్లో సూచించారు. నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, తక్కువ ఎత్తు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరే అవకాశం ఉన్నందున అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా వ్యవసాయ రంగంపై తుపాను ప్రభావం అధికంగా ఉన్నందున రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వరి కోతలను రెండు, మూడు రోజుల పాటు వాయిదా వేసుకోవాలని తెలిపారు. ఇప్పటికే కోసిన పంటను సురక్షిత ప్రదేశాలకు తరలించి, ఎత్తయిన ప్రదేశాల్లో నిల్వ చేయాలని సూచించారు. ఏపీ వైపు వెళ్లే వారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని తెలిపారు. వర్షాలు కురిసే సమయాల్లో చెట్ల కింద ఉండొద్దని పేర్కొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
