 
															వణికిస్తున్న మోంథా
నేలవాలుతున్న వరి..
● జిల్లాను తాకిన తుపాను ప్రభావం ● ఈదురు గాలులతో వర్షం ● పంటలు దెబ్బతింటాయని రైతుల్లో ఆందోళన 
బూర్గంపాడు: జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి వాతావరణం మారిపోయింది. ఈదురు గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. మోంథా తుపాను ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే హెచ్చరించిన వాతావరణ శాఖ.. జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. తుపాను నేపథ్యంలో జిల్లా అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. విపత్తుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టారు. రైతులు బుధ, గురువారాల్లో వ్యవసాయ పనులు మానుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వరికోతలు, పత్తితీతలు నిలిపివేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులు కోరారు.
పనులకు బ్రేక్..
తుపాను నేపథ్యంలో మంగళవారం వరికోతలు, పత్తితీతలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పనులకు బ్రేక్ పడింది. ఇప్పటికే జిల్లాలో వరికోతలు ముమ్మరంగా సాగడంతో పాటు పత్తితీతలు ఊపందుకోవాల్సి ఉంది. అయితే ఇటీవల వరకు కురిసిన వర్షాల కారణంగా వ్యవసాయ పనులు ఆలస్యమయ్యాయి. ఇప్పుడు మోంథా తుపాను కారణంగా మరింత జాప్యం జరుగుతుండడంతో పంటలు చేతికందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వరికోతలు ప్రారంభం కాగా, ధాన్యం ఆరబోసేందుకు ఖాళీ స్థలాలు, కల్లాలు లేవు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న రైతులను తుపాను మరింతగా కష్టాల పాలు చేసింది. తుపాను హెచ్చరికల నేపథ్యంలో పచ్చి వడ్లను తక్కువ ధరకే మిల్లర్లు, వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ధాన్యం ఆరబెట్టాలంటే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో చాలా శ్రమతో కూడుకోవడంతో పాటు వసతులు లేకపోవడంతో పచ్చి వడ్లనే అమ్ముతున్నారు. పత్తితీత పనులు కూడా తుపాను నేపథ్యంలో నిలిచిపోయాయి. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి పత్తి చెట్టపైనే పూర్తిగా తడిసింది. దీంతో పత్తి తీసే పనులను నిలిపివేశారు.
మోంథా తుపాను ప్రభావం జిల్లాపై ఎక్కువగానే ఉంటుందనే ప్రచారంతో రైతుల్లో కలవరం మొదలైంది. ఓ వైపు కోతకు వచ్చిన పొలాలు, మరో పక్క పూసిన పత్తి చేలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తుపాను గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటే వరి పంట నేలవాలడంతో పాటు పత్తి మొక్కలు కూడా ఒరిగిపోతాయనే భయాందోళనలు వారిలో వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కోసిన పంటలను తుపాను బారి నుంచి కాపాడుకునేందుకు టార్పాలిన్లు, పరదాలు సిద్ధం చేసుకుంటున్నారు. అధిక వర్షాల కారణంగా ఇప్పటికే చెరువులు, కుంటలు నిండిపోయాయి. ఇప్పుడు తుపానుతో భారీ వర్షాలు కురిస్తే మళ్లీ చెరువు కట్టలు, అలుగులు తెగిపోయి పంటలు పాడవుతాయనే ఆందోళన సైతం రైతుల్లో వ్యక్తమతోంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
