 
															నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
సమయపాలన పాటించాలి
చుంచుపల్లి: వైద్య సిబ్బంది సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ జయలక్ష్మి సూచించారు. తన కార్యాలయంలో మంగళవారం ఆమె జిల్లాలోని వైద్యాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నవంబర్ 1 నుంచి 7 వరకు కేంద్ర జాతీయ ఆరోగ్య మిషన్ బృందాలు జిల్లాలో పర్యటించనున్నందున ఆ మేరకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆరోగ్య కేంద్రాల్లో రికార్డులు సక్రమంగా నిర్వహించాలని, వైద్య సిబ్బంది ఎవరూ సెలవులు తీసుకోవద్దని ఆదేశించారు. గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, శుభ్రత, ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతీ గ్రామంలో ప్రజలకు జాతీయ ఆరోగ్య మిషన్ లక్ష్యాలను వివరించి పాల్గొనేలా ప్రోత్సహించాలని చెప్పారు. సమావేశంలో డాక్టర్లు సైదులు, చైతన్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయిలో గురుకుల విద్యార్థిని ప్రతిభ
ఇల్లెందురూరల్ : గోవిజ్ఞాన్ రాష్ట్ర స్థాయి పరీక్షలో ఇల్లెందు మండలం సుదిమళ్ల గిరిజన సంక్షేమ గురుకుల కళాశాల విద్యార్థిని తంగురి వెన్నెల మూడో స్థానం సాధించింది. గోసేవా విభాగం ఆధ్వర్యంలో గ్రామ స్థాయి నుంచి వివిధ దశల్లో నిర్వహించిన గోవిజ్ఞాన్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వెన్నెల.. హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటింది. మూడో స్థానంలో నిలిచిన వెన్నెలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభినందించారు. కాగా, వెన్నెల ప్రతిభ కనబర్చడం పట్ల జిల్లా గోసేవా విభాగం ప్రతినిధులు సతీష్ ఖండేల్‌వాల్, పూనియానాయక్ హర్షం వ్యక్తం చేశారు.
 
							నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
 
							నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
