 
															అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా
● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● మధిరలో భూగర్భ కేబుల్ ఏర్పాటు  పనులకు శంకుస్థాపన 
మధిర: రాష్ట్రమంతా భారీ వర్షాలు, తుపాన్ వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేసేలా చర్యలు చేపట్టామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిరలో రూ.27.76 కోట్ల వ్యయంతో చేపట్టే భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ ‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యం నెరవేరడంలో విద్యుత్ శాఖే కీలకమని తెలిపారు. ఏ రంగం అభివృద్ధి సాధించాలన్నా నాణ్యమైన విద్యుత్ అవసరమని, అందుకే రూ.కోట్లలో నిధులు వెచ్చిస్తూ బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
దశల వారీగా...
మధిర ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. తొలిదశలో రూ. 27.76కోట్లతో 3.5 కి.మీ. మేర 33 కేవీ లైన్, 17.3 కి.మీ. మేర 11 కే.వీ. లైన్, 15 కిలోమీటర్ల నిడివితో ఎల్‌టీ లైన్‌ను భూగర్భంలో వేస్తామని చెప్పారు. అలాగే, సబ్‌స్టేషన్ నుంచి ఆత్కూరు రింగ్ రోడ్డు, విజయవాడ రోడ్డులోని గ్యాస్ గోదాం(రెండు వైపులా), వైఎస్సార్ విగ్రహం నుంచి అంబారుపేట చెరువు వరకు ప్రస్తుతం ఉన్న 11 కే.వీ. ఓవర్ హెడ్ లైన్లను భూగర్భంలో మార్చేలా ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. అంతేకాక నందిగామ బైపాస్ రోడ్డు హెచ్‌పీ బంక్ నుండి డంప్ యార్డ్ వరకు భూగర్భ విద్యుత్ లైన్ పనులు చేపడతామన్నారు. తద్వారా విద్యుత్ తీగలు బయటకు ఎక్కడా కనిపించవని, విద్యుత్ సంబంధిత ప్రమాదాలు జరగవని తెలిపారు. అంతేకాక రోడ్ల వెంట మొక్కల పెంపకానికి అవకాశ ం ఏర్పడడంతో పాటు భారీ వర్షాలు, తుపాన్ల సమయాన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండదని చెప్పారు. కాగా, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది వెళ్లేలా విద్యుత్ అంబులెన్స్‌లను సమకూర్చగా, 1912 నంబర్‌కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. ఆతర్వాత మడుపల్లిలో విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేయగా, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, విద్యుత్ శాఖ ఎస్‌ఈ శ్రీనివాసాచారి, ఆర్‌అండ్ బీ ఈఈ తానేశ్వర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
