 
															నేరస్తులకు శిక్ష పడేలా చూడాలి
● విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ● పోలీస్ సిబ్బందికి ఎస్పీ రోహిత్‌రాజు హెచ్చరిక 
కొత్తగూడెంటౌన్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీస్ అధికారులు, సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని, ప్రతీ కేసులో సమగ్ర విచారణ నిర్వహించి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. మంగళవారం ఆయన జిల్లా పోలీసు అఽధికారులతో నెలవారీ నేర సమీక్ష సమావేశంలో భాగంగా వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. నిషేధిత గంజాయి అక్రమ రవాణా, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. చైతన్య కార్యక్రమంలో భాగంగా జిల్లాలో హాట్‌స్పాట్లను గుర్తించి గంజాయి రవాణా చేసేవారితో పాటు సేవించే వారిపైనా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించాలని, నివారణకు ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని కోరారు. చోరీ కేసుల్లో సాంకేతికతను వినియోగించి నిందితులను పట్టుకోవాలని, చోరీకి గురైన సొత్తును రికవరీ చేయాలని చెప్పారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయవాదులతో సమన్వయం చేసుకుని బాధితులకు న్యాయం చేయాలన్నారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్యస్వామి, కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, సతీష్‌కుమార్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
