 
															లక్కు దక్కిందిలా..
లాటరీ పద్ధతిలో మద్యం షాపుల కేటాయింపు
డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాల్లో విక్రయాలు
ప్రశాంతంగా ముగిసిన డ్రా ప్రక్రియ
అమ్మకాల్లో నిబంధనలు పాటించాలని కలెక్టర్ సూచన
డ్రా లో పెరిగిన మహిళల సంఖ్య..
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలో నూతన మద్యం దుకాణాలకు కొత్తగూడెం క్లబ్‌లో సోమవారం జరిగిన లక్కీ డ్రా కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఆరు స్టేషన్ల పరిధిలో చాలా మంది సిండికేట్ అయి టెండర్లు వేయగా, మరికొందరు ఒంటరిగా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు టెండర్లు దాఖలు చేశారు. కొత్తగూడెంలో ఓ సిండికేట్ వర్గం వారు 21 దరఖాస్తులు దాఖలు చేయగా, ఒక్క షాపు మాత్రమే దక్కింది. టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, అశ్వారావుపేటకు చెందిన మరో 56 మంది సిండికేట్‌గా ఏర్పడి 108 దరఖాస్తులు దాఖలు చేయగా వారికి మూడు షాపులే వచ్చాయి. ఈ ఏడాది టెండర్ దాఖలుకు రూ.3లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించడంతో దరఖాస్తులు తగ్గినా.. గతంలో కంటే అధికంగానే ఆదాయం సమకూరింది. డ్రాలో షాపులు దక్కించుకున్న వారి నుంచి జిల్లా ఎకై ్సజ్ అధికారులు.. శ్లాబ్ ప్రకారం మొదటి విడత ఫీజు స్వీకరించారు. డిసెంబర్ 1 నుంచి కొత్త దుకాణాల లైసెన్సులు ప్రారంభం కానున్నాయి. జిల్లాలో 88 వైన్ షాపులు, 13 బార్లు ఉన్నాయి. 2023లో జరిగిన మద్యం దుకాణాల టెండర్ ప్రక్రియలో రూ.2 లక్షల ఫీజుతో మొత్తం 5,057 దరఖాస్తులు రాగా, ప్రస్తుతం రూ.3లక్షల ఫీజుతో 3,922 దరఖాస్తులు వచ్చాయి.
పారదర్శకంగా వ్యవహరించాం..
జిల్లాలో నూతన మద్యం దుకాణాల లైసెన్సుల కేటాయింపునకు పారదర్శకంగా లాటరీ తీశామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. దరఖాస్తుదారులందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే డ్రా పద్ధతిని పాటించామన్నారు. కార్యక్రమమంతా సీసీటీవీల పర్యవేక్షణలో, వీడియో రికార్డింగ్, ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా ప్రజల సమక్షంలో నిబంధనల ప్రకారం నిర్వహించామని వివరించారు. టెండర్లు దక్కించుకున్న వారు నిర్దేశిత కాల వ్యవధిలో లైసెన్స్ ఫీజు చెల్లించి, షాపుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే మద్యం విక్రయించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేకుండా మద్యం విక్రయించే దుకాణాలు, బెల్ట్ షాపులు, నకిలీ మద్యం తయారీ కేంద్రాలపై ప్రత్యేక దాడులు, సర్వేలు కొనసాగుతాయని తెలిపారు. అక్రమ వ్యాపారాల విషయంలో ప్రజలు కూడా అధికారులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ట్రెయినీ కలెక్టర్ సౌరభ్‌శర్మ, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జానయ్య, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కరంచంద్ తదితరులు పాల్గొన్నారు.
శేషగిరిని కరుణించిన పెద్దమ్మతల్లి !
పాల్వంచరూరల్: మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయం వద్ద వైన్స్ కోసం పలువురు పోటీ పడగా మారుమూల ప్రాంతానికి చెందిన వాడే శేషగిరికి దక్కింది. ఈ వైన్స్ కోసం జిల్లాలోనే అత్యధికంగా 102 టెండర్లు దాఖలయ్యాయి. ఈ మేరకు ములకలపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన వాడే శేషగిరి డ్రాలో షాపు దక్కించుకున్నాడు. ఆయన మరో 11 మంది మిత్రులతో కలిసి దరఖాస్తు చేసుకున్నాడు.
మద్యం దుకాణాలకు డ్రా కార్యక్రమంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో కనిపించడం గమనార్హం. కొందరు సెంటిమెంట్‌తో మహిళల పేర్లతోనే దరఖాస్తు చేయగా, డ్రా కార్యక్రమానికి వారిని తీసుకొచ్చారు. గతంలో డ్రా కార్యక్రమంలో మహిళలు తక్కువగా కనిపించే వారు. కానీ సోమవారం నాటి కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని దుకాణాలకు ఎక్కువ మంది మహిళలతో టెండర్లు వేయించారు. మొత్తంగా 88 మద్యం దుకాణాలకు గాను 44 షాపులు ఎస్టీలకు, ఏడు ఎస్సీలకు, 31 ఓపెన్, ఆరు గౌడ కులస్తులకు కేటాయించారు.
 
							లక్కు దక్కిందిలా..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
