 
															వణికిస్తున్న వాయుగండం
సీసీఐ కేంద్రాలు ప్రారంభమైనా నిరుపయోగమే..
తుపాను నేపథ్యంలో రైతుల్లో హైరానా
● ఇప్పటికే ఆలస్యమవుతున్న వరికోతలు ● మొదలైనా ముందుకు సాగని  పత్తితీతలు 
బూర్గంపాడు: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏర్పడిన మొంథా తుపాన్ రైతులను వణికిస్తోంది. తుపాన్ ప్రభావం మంగళవారం నుంచి ఉంటుందని చెప్పిన వాతావరణ శాఖ.. జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల క్రితం వరకు కురిసిన వర్షాలతో ఇప్పటికే వరికోతలు ఆలస్యమయ్యాయి. కోతకు వచ్చి వరిపంట వర్షాలతో నేలవాలింది. చాలాచోట్ల మాగాణుల్లో నీరు నిలిచి వరికోతలకు ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో తుపాన్ అలర్ట్ రైతులను కలవరపరుస్తోంది. ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పత్తితీతలు కూడా ఆలస్యమయ్యాయి. ఒకరోజు పత్తి తీయిస్తే వర్షాల కారణంగా నాలుగు రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. దీంతో ఇప్పటికే తొలివిడత పత్తితీతలు పూర్తి కావాల్సి ఉన్నా.. చాలాచోట్ల మొదలేకాని పరిస్థితి నెలకొంది.
కుంగదీస్తున్న వానలు..
ఈ ఏడాది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలకు తీవ్ర నష్టం కలిగించాయి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పండించిన పంట చేతికందే సమయంలో అకాల వర్షాలు రైతులను మరింతగా కుంగదీస్తున్నాయి. జిల్లాలో ఈ ఏడాది సుమారు 2.25 లక్షల ఎకరాల్లో పత్తి, 1.85 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఆగస్టు నుంచి తరచూ వర్షాలు పడుతుండడంతో పంటల సాగుకు ప్రతిబంధకంగా మారింది. అధిక వర్షాలతో చీడపీడలు, తెగుళ్లు, పురుగు ఉధృతి పెరిగింది. భూమి, గాలిలో తేమశాతం ఎక్కువగా ఉండడంతో దిగుబడులపై ప్రభావం చూపింది. ఎన్నో తిప్పలు పడి పండించిన పంటను తీసుకునేందుకు వర్షాలు ఆటంకంగా మారాయి. మొంథా తుపాన్ ప్రభావం జిల్లాపై ఉంటుందనే హెచ్చరికల నేపథ్యంలో రైతులు వరికోతలు, పత్తి తీత పనులను నిలిపివేశారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఆకాశం మేఘావృతమై అక్కడక్కడా చిరు జల్లులు కురవడం ప్రారంభమైంది. జిల్లాలో మంగళవారం భారీ నుంచి అతి భారీవర్షాలు కురవొచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు పత్తితీతలు, వరి కోతలను నిలిపివేశారు.
అన్నదాతల ఆందోళన..
అధిక వర్షాలతో ఈ ఏడాది వరి పంటకు తాటాకు, ఎండు తెగుళ్ల ఉధృతి ఎక్కువగా ఉంది. వీటి నివారణకు రైతులు రూ.వేలు ఖర్చు చేశారు. ప్రస్తుతం పంట కోతకు సిద్ధంగా ఉంది. వర్షాల కారణంగా కోతలు ఆలస్యం కావడంతో కొన్నిచోట్ల వరి పంట నేలవాలింది. మొంథా తుపాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిస్తే పంట చేతికి వస్తుందా.. రాదా అనే డైలామాలో రైతులున్నారు. హార్వెస్టర్లతో వరి కోయాలంటే భూమి ఆరకపోవడం, ధాన్యం ఆరబోసేందుకు కల్లాలు లేకపోవడం, ధాన్యం తరలించేందుకు పొలం బాటలు బురదమయంగా ఉండడం వారిని కలవరపరుస్తోంది. ప్రస్తుత తుపాన్ ప్రభావంతో వరికోతలు మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. నవంబర్ మొదటివారంలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నా.. చాలాచోట్ల వాటి నిర్వహణకు అనువైన పరిస్థితి లేదు. ఇప్పటికే కోసిన పచ్చి ధాన్యాన్నే వ్యాపారులకు, మిల్లర్లకు విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ధాన్యానికి క్వింటాకు రూ. 2,389 మద్దతు ధర ప్రకటించగా ప్రస్తుతం రైతులు పచ్చి ధాన్యాన్ని రూ. 1,300 నుంచి రూ.1,450 వరకు అమ్ముకుంటున్నారు. ఇక మొక్కజొన్న కోతలు జరుగుతుండగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో ఆరబోసిన మొక్కజొన్న వానలకు తడిసిపోతోంది. ఇక తుపాన్ వస్తే పంటలకు మరింతగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
ఇప్పటికే రైతులు తీసిన పత్తిలో తేమశాతం ఎక్కువగా ఉందని వ్యాపారులు కొనడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనా రైతుల వద్ద నుంచి పత్తి కొనుగోలు చేయడం లేదు. తేమశాతం 8 కంటే తక్కువగా ఉంటేనే కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే వర్షాల కారణంగా పత్తిలో తేమశాతం తగ్గడం లేదు. చేలలో పూసిన పత్తి వర్షాలకు పాడవుతుండడంతో రైతులు తీయిస్తున్నారు. ఆ పత్తిని ఇళ్లలో నిల్వ చేసుకోలేకపోతున్నారు. అందులో తేమశాతం ఎక్కువగా ఉండడం, ఆరబెట్టే వీలు లేకపోవటంతో తక్కువ ధరకే ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పత్తికి క్వింటాకు రూ. 8,110 మద్దతు ధర ప్రకటిస్తే, ప్రస్తుతం రైతుల నుంచి వ్యాపారులు క్వింటా రూ.4 వేల నుంచి రూ 5 వేల మధ్యనే కొనుగోలు చేస్తున్నారు. ఓ వైపు దిగుబడి రాక, మరో వైపు మద్దతు ధర దక్కక రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
