 
															లక్కు ఎవరికో..?
● నేడు కొత్తగూడెం క్లబ్‌లో మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ● ఏర్పాట్లు పూర్తిచేసిన ఎకై ్సజ్ అధికారులు ● జిల్లా వ్యాప్తంగా 88 షాపులకు 3,922 దరఖాస్తులు 
పాల్వంచరూరల్: మద్యం దుకాణాల కేటాయింపునకు సోమవారం లక్కీ డ్రా తీయనున్నారు. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం క్లబ్‌లో ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. లక్కు ఎవరిని వరిస్తుందోనని దరఖాస్తుదారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 88 మద్యం దుకాణాలు ఉండగా, 2025–2027 సంవత్సరాల కాలానికి లైసెన్స్ కోసం గత నెల 26 నుంచి ఈ నెల 23 వరకు టెండర్ దరఖాస్తులు స్వీకరించారు. గతంలో రూ.2 లక్షలు ఉన్న లైసెన్స్ దరఖాస్తు ఫీజును ప్రభుత్వం ఈసారి రూ.3 లక్షలకు పెంచింది. ఈ క్రమంలో గతం కంటే దరఖాస్తులు తగ్గినా ఆదాయం పెరిగింది. మొత్తం 3,922 దరఖాస్తులు రాగా, ఎకై ్సజ్ శాఖకు రూ. 117.66 కోట్ల ఆదాయం వచ్చింది. లాటరీ పద్ధతిలో షాపుల కేటాయింపు కోసం ఎకై ్సజ్‌శాఖ ఏర్పాట్లు చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు లాటరీ తీసే ప్రక్రియను కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రారంభిస్తారని ఎకై ్సజ్ శాఖ సూపరింటెండెంట్ జానయ్య తెలిపారు. లాటరీలో షాపును దక్కించుకున్న వ్యాపారులు డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించనున్నారు. నిర్దేశించిన లైసెన్స్ ఫీజును రెండేళ్ల కాలంలో ఆరు విడతలుగా చెల్లించే అవకాశం ఉంది. మొదటి విడుత ఫీజు మాత్రం వచ్చే నెలాఖరులోగా చెల్లించాలి. జిల్లాలోని ఐదు ఎకై ్సజ్ స్టేషన్లు ఉండగా, భద్రాచలంలో అత్యధికంగా 16 షాపులకు 828 దరఖాస్తులు వచ్చాయి. మణుగూరులో 15 షాపులు ఉండగా తక్కువగా 512 దరఖాస్తులు వచ్చాయి. ఇక పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి వద్ద షాపునకు రికార్డు స్ధాయిలో 102 దరఖాస్తులు వచ్చాయి. కాగా నాలుగు, ఐదు దరఖాస్తులు దాఖలు చేసిన వ్యాపారులు ఒక్క షాపైనా వస్తుందో రాదోనని టెన్షన్ పడుతున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
