 
															రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
మణుగూరు టౌన్: కారు చెట్టును ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బీటీపీఎస్ విశ్రాంత ఉద్యోగి సందుపట్ల కృష్ణారెడ్డి(60) సమితిసింగారంలో నివసిస్తున్నాడు. సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసి పాల్వంచ నుంచి మణుగూరు వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో తోగ్గూడెం ఆలయ సమీపంలో అదుపు తప్పిన కారు చెట్టును ఢీకొంది. దీంతో కృష్ణారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రుడిని 100 పడకల ఆస్పత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. మృతుడి భార్య సబిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు సందర్శించి సంతాపం తెలిపారు. సూపరింటెండెంట్ సునీల్ తదితరులు ఉన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
