ముంచిన ‘ఆయిల్‌పామ్‌’ | - | Sakshi
Sakshi News home page

ముంచిన ‘ఆయిల్‌పామ్‌’

Oct 26 2025 8:09 AM | Updated on Oct 26 2025 8:09 AM

ముంచి

ముంచిన ‘ఆయిల్‌పామ్‌’

నాసిరకం మొక్కలు ఇచ్చినట్లు

ఆయిల్‌ఫెడ్‌ పై విమర్శలు

లక్షల రూపాయల్లో నష్టపోయిన రైతులు

దమ్మపేటలో 20 ఎకరాల్లో

తోటల తొలగింపు

నాణ్యతలేని మొక్కలను అంటగట్టిన అధికారులు

అశ్వారావుపేట: కాతలేని ఆయిల్‌పామ్‌ చెట్లను అధికారులు తొలగిస్తున్నారు. దమ్మపేట మండలం పెద్దగొల్లగూడెం రెవెన్యూ గ్రామ పరిధిలోని చింతల చెరువు సమీపంలో నలుగురు రైతులకు చెందిన 20 ఎకరాల తోటలను ఆయిల్‌ఫెడ్‌ అధికారులు తవ్వేస్తున్నారు. ఐదేళ్లపాటు పెంచినా చెట్లు కాతకురాలేదు. ఎకరానికి సుమారు రూ.5 లక్షల చొప్పున పెట్టుబడి పెట్టిన రైతులు నిరాశ చెందుతున్నారు. ఆయిల్‌ఫెడ్‌ యాజమాన్యం మొక్కలను తొలగించేందుకు జేసీబీలను మాత్రమే పంపింది. ఆ తర్వాత కొమ్మలు, బోదెలను రైతులే తొలగించుకోవాలని సూచించడంతో ఎకరాకు కనీసం రూ.20వేలకు పైగా అవుతుందని ఆవేదన చెందుతున్నారు. ఆదాయం వస్తుందని ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టిన గిరిజన కుటుంబాలు సంశయంలో పడ్డాయి. రానున్న రోజుల్లోనైనా నాణ్యమైన మొక్కలు ఇవ్వాలని కోరుతున్నాయి.

రైతులు నష్టపోయినా.. పరిహారం ఊసేలేదు

2015 నుంచి మొదలైన ఈ వ్యవహారం బయటపడేందుకు దశాబ్దం పట్టింది. ఈ సమస్యపై ఓ రైతు సంఘం ఢిల్లీ దాకా పోరు సల్పడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. తప్పులు దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. పరిహారం చెల్లించాలని నష్టపోయిన రైతులు డిమాండ్‌ చేస్తున్నా ఆయిల్‌ఫెడ్‌ యాజమాన్యం, ప్రజాప్రతినిధులు స్పందించడంలేదు. ఈ విషయమై ఆయిల్‌ఫెడ్‌ అశ్వారావుపేట డివిజన్‌ అధికారి నాయుడు రామకృష్ణను వివరణ కోరగా.. ప్రభుత్వ ఆదేశాలతో 55 మంది రైతులకు 7,574 మొక్కలను తిరిగి సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. పరిహారం చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు లేవని తెలిపారు.

ఆయిల్‌ఫెడ్‌ మొక్కలపై నమ్మకం లేదు

ములకలపల్లి మండలం పొగళ్లపల్లికి చెందిన తాండ్ర దిలీప్‌కుమార్‌, సుభద్ర దంపతులు ఆరేళ్ల క్రితం 19 ఎకరాల్లో టీఎస్‌ ఆయిల్‌ఫెడ్‌ ఇచ్చిన మొక్కలతో సాగు మొదలుపెట్టారు. ఎకరానికి 54 మొక్కలను నాటారు. ఐదేళ్లు దాటినా కాపు రాకపోవడంతో గత జూన్‌లో 300 మొక్కలను తొలగించారు. ఇంకా మిగిలిన మొక్కల పరిస్థితీ అలాగే ఉంది. దీంతో భారీగా నష్టపోయారు. ఆయిల్‌ఫెడ్‌ అధికారులు కొత్తగా మొక్కలను ఇస్తామని చెబుతున్నా మళ్లీ సాగు చేసేందుకు సాహసించడంలేదు.

ఐదేళ్లు పెంచినా కాతరాని పామాయిల్‌ చెట్లు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయిల్‌పామ్‌ విస్తరణను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. దీంతో పదేళ్లుగా ఆయిల్‌పామ్‌ విస్తీర్ణం పెరుగుతోంది. ప్రస్తుత వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా మొదటి నుంచీ పామాయిల్‌ తోటల సాగుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తోటల పెంపకానికి ఆసక్తి చూపారు. ఆయిల్‌పామ్‌ సాగు చేసే ఆదాయం పెరిగి కష్టాలు పోతాయని భావించారు. అయితే సాగునీటి లభ్యత లేకున్నా రాజకీయ పలుకుబడి ఉన్న ప్రాంతాల రైతులకు అశ్వారావుపేట(నారంవారిగూడెం) నర్సరీ నుంచి భారీగా మొక్కలు తరలి వెళ్లేవి. స్థానిక సన్న, చిన్నకారు రైతులకు మొక్కలు అందేవి కావు. అధికారులు ఇదే అదనుగా పనికిరాని మొక్కలను సైతం రైతులకు అంటగట్టారు. తోటల్లో రాలిన గింజల నుంచి వచ్చే మొక్కలను సైతం రైతులకు పంపిణీ చేశారనే ఆరోపణలున్నాయి.

ముంచిన ‘ఆయిల్‌పామ్‌’1
1/1

ముంచిన ‘ఆయిల్‌పామ్‌’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement