 
															గంజాయి కేసులో పీడీ యాక్ట్ నమోదు
జూలూరుపాడు: గంజాయి అక్రమ రవాణా కేసులోని నిందితుడిపై జూలూరుపాడు పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బూర్గంపాడు మండలం సారపాక తాళ్లగొమ్మూరుకు చెందిన దుగ్గెంపూడి శివశంకర్ రెడ్డి అనే వ్యక్తి గంజాయి అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడటంతో పలు పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. జైలుకు వెళ్లొచ్చాక కూడా తీరు మార్చుకోకుండా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నాడు. దీంతో నిందితుడిపై పీడీ యాక్ట్‌ను అమలు చేస్తూ ఈనెల 23వ తేదీన పోలీస్ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీఐ శ్రీలక్ష్మి, ఎస్‌ఐ రవి పీడీ యాక్ట్ నమోదు చేసి, సంబంధిత పత్రాలను చర్లపల్లి జైలు అధికారుల సమక్షంలో నిందితుడికి ఇచ్చారు. కోర్టు ఆదేశాలతో శివశంకర్ రెడ్డి ఆస్తులను జూలూరుపాడు పోలీసులు జప్తు చేశారు.
గంజాయి అక్రమ రవాణాకు అడ్డకట్ట
గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చైతన్యం–డ్రగ్స్‌పై యుద్ధం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిందితుడు శివశంకర్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదయ్యేలా కృషి చేసిన కొత్తగూడెం డీఎస్పీ అబుల్ రెహమాన్, జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మీ, ఎస్‌ఐ రవి, పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
