 
															వేగమేదయా ?!
ఆగిన పాలేరు టన్నెల్
సీతారామా..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో 6.74 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు పనులు లక్ష్యం మేర సాగడం లేదు. భద్రాద్రి జిల్లాలో మూడు పంపుహౌస్‌లు, 104 కి.మీ. మేర ప్రధాన కాల్వ పూర్తయినా.. ఖమ్మం జిల్లాలో ప్రధాన కాల్వ, టన్నెళ్ల తవ్వకంలో జాప్యం జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.19,324 కోట్లకు పెంచినప్పటికీ ఆ మేరకు నిధులు రావడం లేదు. జూలూరుపాడు వద్ద టన్నెల్ తవ్వకం ప్రారంభానికే నోచుకోకపోగా, తిరుమలాయపాలెం వద్ద టన్నెల్ సగంలో నిలిచిపోయింది. సత్తుపల్లి మండలం యాతాలకుంట వద్ద టన్నెల్ నిర్మాణం నిదానంగా సాగుతోంది. ఇప్పటివరకు చేసిన పనులు, భూసేకరణకు సంబంధించి రూ.258.26 కోట్ల బిల్లులు పెండింగ్ ఉండడంతో పనులు ఊపందుకోవడం లేదు.
ఖమ్మం జిల్లాలో నత్తనడకన..
సీతారామ ఎత్తిపోతల పథకాన్ని 2026 నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో రెండు జిల్లాల్లో పనులను 16 ప్యాకేజీలుగా విభజించారు. భద్రాద్రి జిల్లాలో ప్రధానకాల్వ నిర్మాణం, మూడు పంప్‌హౌస్‌ల పనులు పూర్తికాగా, డిస్ట్రిబ్యూటరీల నిర్మాణానికి టెండర్లు, భూసేకరణ సాగుతోంది. డిస్ట్రిబ్యూటరీలను భద్రాద్రి జిల్లాలో 1, 2, 7, 8, ఖమ్మం జిల్లాలో 3, 4, 5, 6 ప్యాకేజీలుగా చేపడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 6వ ప్యాకేజీ మినహా మిగతా వాటికి అనుమతులే రాలేదు. అలాగే, ప్రధాన కాల్వ పనులు పూర్తి కాలేదు. ఇక 13 నుంచి 16 ప్యాకేజీల్లో సత్తుపల్లి ట్రంక్ కెనాల్, పాలేరు లింక్ కెనాల్ పనులు పెండింగ్ ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి 1,138.693 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉండగా, ఖమ్మం జిల్లాలో అనుమతులు రావాల్సి ఉంది.
ప్రధాన కాల్వకు అడ్డంకులు
ఖమ్మం జిల్లాలో 13 నుంచి 16 ప్యాకేజీల కింద ప్రధాన కాల్వలు నిర్మించాలి. ఏన్కూరు నుంచి 75 కి.మీ. మేర ప్రధాన కాల్వ తవ్వితేనే గోదావరి జలాలు రిజర్వాయర్‌లోకి చేరతాయి. దీంతో ఎన్నెస్పీ ఆయకట్టును స్థిరీకరించినట్టవుతుంది. కానీ భూసేకరణ, నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. అంతేకాక 13వ ప్యాకేజీలో 10.53 కి.మీ. కాల్వ పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్యాకేజీలో 167.76 ఎకరాల పట్టా, 213.60 ఎకరాల అటవీ భూమి సేకరించాల్సి ఉంది.
కొన్ని ప్యాకేజీల్లో ఇలా..
ప్యాకేజీ 14లో 10.50 కి.మీ. నుంచి 39.50 కి.మీ. వరకు 29 కి.మీ. మేర కాల్వ నిర్మించాలి. ఇంకా 26.11 కిలోమీటర్లు పూర్తి కావాలి. ఈ పరిధిలో రెండు రైల్వేలైన్లు, ఒక గ్యాస్ పైప్‌లైన్ ఉండగా, 1,021 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అందులో 872 ఎకరాలు మాత్రమే సేకరించగా 761 ఎకరాలకు పరిహారం చెల్లించారు. ఇంకా రూ.80.85 కోట్లు పెండింగ్ ఉంది. ప్యాకేజీ 15లో 23.20 కి.మీ. కాల్వకు గాను 16.96 కి.మీ. పనులు జరుగుతున్నాయి. ఇందులో రెండు అక్విడెక్ట్‌లు ఉన్నాయి. ఈ ప్యాకేజీలో 740 ఎకరాలకు గాను 685 ఎకరాలు సేకరించి 34 ఎకరాలకే పరిహారం చెల్లించారు. ప్యాకేజీ 16లో 4.57 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మాణానికి 1.20 కి.మీ.మేర పనులు సాగుతున్నాయి. ఇక్కడ అవసరమైన 336 ఎకరాల్లో 321 ఎకరాల భూమి సేకరించి 12 ఎకరాలకు పరిహారం చెల్లించారు. ఇంకా రూ.2.09 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఈ ప్యాకేజీలో అప్రోచ్ కెనాల్ నిర్మాణానికి రూ.70 కోట్లు మంజూరు చేశారు.
ఖమ్మం జిల్లాలోని 16వ ప్యాకేజీ కింద తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం నుంచి కూసుమంచి మండలం పోచారం వరకు 8.2 కి.మీ. టన్నెల్ పనులు నిలిచిపోయాయి. ఇప్పటి వరకు నాలుగు కి.మీ. పూర్తికాగా రూ.170 కోట్ల బిల్లుల్లో రూపాయీ విడుదల కాక కాంట్రాక్టర్ పనులు ఆపేశారు. పూర్తయిన టన్నెల్‌లోనూ నిలిచిన నీటిని తొలగించడానికి మూడు నెలలు పడుతుంది. 2022లో ప్రారంభమైన ఈ టన్నెల్ పనులను తొలుత 2024 నాటికి, ఆతర్వాత 2026 సెప్టెంబర్ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ నిధులు రాక, టన్నెల్‌లో నీరు నిలిచి అప్పటికీ పూర్తవడం కష్టమే. ఇక భద్రాద్రి జిల్లా జూలూరుపాడు వద్ద 1.650 కి.మీ. టన్నెల్ నిర్మాణం మొదలే కాకపోగా, సత్తుపల్లి ట్రంక్ కెనాల్ పరిధిలో యాతాలకుంట వద్ద కూడా నత్తనడకన సాగుతున్నాయి. ప్రధాన కాల్వ పనులతో పాటు టన్నెల్ పనులు పూర్తయితేనే గోదావరి జలాలు ఈ ప్రాంతానికి అందుతాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
