 
															అభివృద్ధి ప్ర‘దాతలు’
ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తేనే..
రామాలయంలో మహారాజ పోషకులే కీలకం
అయినా వారికి దక్కని గుర్తింపు
ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని భక్తుల డిమాండ్
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వ తోడ్పాటు కరువవుతోంది. అయితే తమ ఇంటి ఇలవేల్పుగా భావిస్తున్న భక్తులు రామయ్యకు పలు రూపాల్లో విరాళాలు అందజేస్తున్నారు. కానీ వారికి దేవస్థానంలో తగిన మర్యాద, మన్ననలు అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఈ మేరకు ఆలయ, దేవాదాయ శాఖ అధికారులు సమష్టిగా ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.
వితరణలతోనే వసతులు..
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరిలో రామయ్య దేవస్థానానికి పునాది పడింది నాడు కంచర్ల గోపన్న సేకరించిన ప్రభుత్వ ఖజానాతోనే. 17వ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయాన్ని నేటి వరకు ప్రభుత్వం ఎంతో కొంత అభివృద్ధి చేసినా.. భక్తులు సమర్పించిన విరాళాలు, వితరణలతోనే మరిన్ని వసతులు సమకూరాయి. ఇందులో ప్రధానంగా అంతరాలయంలో బంగారు వాకిలి, వెండి వాకిలి, స్వర్ణ పూరిత వాహనాలు, మూలమూర్తులకు స్వర్ణ కవచాలంకరణ, ఆలయంలో, చుట్టుపక్కల షెడ్‌ల వంటివి భక్తులు సమర్పించిన విరాళాలతోనే చేయించారు. ఇంకా దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే శాశ్వత నిత్యాన్నదానం, గోశాల, సత్రాలు, వసతిగదులు, కాటేజీల నిర్మాణానికి పలు రాష్ట్రాల దాతలు ముందుకొచ్చారు.. వస్తూనే ఉన్నారు. వీటితో పాటు ఉత్సవాల నిర్వహణకు వితరణలు, స్వామి, అమ్మవార్లకు బంగారు ఆభరణాలు అందిస్తున్నారు. ఇలా ప్రభుత్వం చేసే అభివృద్ధి కంటే ఇప్పటికీ దాతలు భూ, ధన, వస్తు రూపాల్లో ఇచ్చే విరాళాలపైనే ఆలయాభివృద్ధి ఆధారపడి ఉంటోంది.
విరాళాలకు భరోసా ఏదీ..?
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో భక్తులు అందించే విరాళాలు సద్వినియోగం అయ్యేలా అధికారులు భరోసా కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతేడాది దేవస్థానంలో ఓ కాటేజీ నిర్మాణానికి దాతలు అందించిన నగదు దుర్వినియోగం అయిందనే ఆరోపణలు వచ్చిన విషయం విదితమే. అలాగే భక్తులు అందించే బంగారం, వెండి ఆభరణాల విషయంలోనూ పారదర్శకత పాటించాలని అంటున్నారు. ఇక దాతలకు దేవస్థానంలో సముచిత స్థానం దక్కడం లేదనేది ప్రధాన ఆరోపణ. ఆలయంలో దర్శనాలు, ఉత్సవాల సమయంలో తగు ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు. నిర్దిష్ట విరాళం అందజేసిన దాతలకు ఆలయంలోనే స్వామివారి కండువాలు, ప్రసాదాలు అందించడంతో పాటు వేదాశీర్వచనం చేయాలని అంటున్నారు. ఈ విషయాన్ని ప్రతీ ఏడాది నిర్వహించే దాతల సత్కార కార్యక్రమంలోనూ ప్రస్తావిస్తున్నారు. తాజాగా బుధవారం జరిగిన వేడుకలోనూ ఆలయ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
దేశవ్యాప్తంగా పేరుగాంచిన భద్రాద్రి రామాలయానికి భక్తుల నుంచి అధికారులు భారీ స్థాయిలో విరాళాలు సేకరించలేకపోతున్నారనే అపవాదు సైతం ఉంది. వివిధ రాష్ట్రాలు, ప్రదేశాల నుంచి వచ్చే భక్తులను దాతలుగా మార్చడంలో విఫలమవుతున్నారు. దేవస్థానం వద్ద రశీదు కౌంటర్ మాత్రమే ఏర్పాటు చేశారు. దీనికి అదనంగా ఆలయ ప్రాంగణంలో దాతలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని, ఇందులో ప్రత్యేక ప్రొటోకాల్ దర్శన టికెట్లతో పాటు భక్తుల రద్దీని బట్టి వెయింటింగ్ హాల్ నిర్మించాలని పలువురు సూచిస్తున్నారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక వసతుల కల్పన వంటి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తే మహారాజ పోషకులకు కొదవేమీ ఉండదని అంటున్నారు. ఈ ఏర్పాట్లతో పాటు చెంతనే ఉన్న నవభారత్, ఐటీసీ, బీటీపీఎస్, సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు, పలు కార్పొరేట్ సంస్థల వారితో ఆలయాభివృద్ధిపై చర్చిస్తే విరివిగా నిధులు సమకూరే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
