 
															నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు,అర్చకులు, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ పాల్గొన్నారు.
అధికారులకు
మంత్రి ప్రశంస
ఇల్లెందు: జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గర్భిణులకు అందుతున్న సేవలు, ప్రసవాల పెరుగుదల, ప్రజలకు తగ్గిన ఆర్థికభారం తదితర అంశాలపై ‘ప్రసవ వే‘ధన’ తగ్గింది’ శీర్షికతో గురువారం సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఇది చూసిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ, ఐఅండ్‌పీఆర్ విభాగం ఉన్నతాధికారులు కలెక్టర్, ఐటీడీఏ పీఓ, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. ప్రజాపాలనలో మారుమూల పల్లెల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని, అధికారులు, సిబ్బంది శ్రమించి పనిచేయడం వల్లే భద్రాద్రి జిల్లాలో గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం పొంది ఆర్థిక భారం తగ్గించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మరింత మెరుగైన సేవలు అందించాలని పిలుపునిచ్చారు.
శబరిమలకు ఆర్టీసీ బస్సులు
ఖమ్మంమయూరిసెంటర్: అయ్యప్ప మాలధారులు శబరిమలలో స్వామి దర్శనానికి వెళ్లేందుకు తక్కువ చార్జీలతో ఆర్టీసీ బస్సులు సమకూర్చనున్నట్లు ఖమ్మం రీజియన్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. రీజియన్‌లోని ఏడు డిపోల నుంచి పుష్‌బ్యాక్ సీట్లు కలిగిన సూపర్ లగ్జరీ బస్సులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఐదు, ఏడు రోజుల ప్రయాణంలో ఒక గురుస్వామి, ఇద్దరు మణికంఠ స్వాములు, ఇద్దరు వంట స్వాములకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుందని తెలిపారు. బస్సుల కోసం ఖమ్మం డిపో మేనేజర్(99592 25958), సత్తుపల్లి డిపో(99592 25962), కొత్తగూడెం డిపో (99592 25959), భద్రాచలం డిపో (99592 25960), మధిర డిపో (99592 25961), మణుగూరు డిపో (99592 25963) మేనేజర్‌ను సంప్రదించాలని ఆర్‌ఎం సూచించారు.
గుండాల – తాడ్వాయి అడవుల్లో పులి సంచారం ?
గుండాల: గుండాల, మహబూబాబాద్ జిల్లా పాఖాల కొత్తగూడ, ములుగు జిల్లా తాడ్వాయి సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం. రెండు రోజుల క్రితం పాఖాల కొత్తగూడెం మండలంలో ఓ వ్యక్తి అడవిగేదె దాడిలో మృతి చెందినట్లు గుర్తించిన విషయం విదితమే. కాగా, సరిహద్దు ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తోందనే ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. గుండాల–పస్రా మధ్య లింగాల, గుండాల– దామరతోగు అటవీ ప్రాంతంలో సంచిరిస్తోందని మరి కొందరు అంటున్నారు. అయితే పులి అడుగుజాడలు కానీ, ఆచూకీ కానీ ఇంతవరకూ తెలియరాలేదు. పులి సంచరిస్తోందనే ప్రచారంతో పశువుల కాపరులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మొక్కజొన్న, పత్తి తీసే దశలో ఉండగా ఆ పనులకు వెళ్లేందుకు కూలీలు వణికిపోతున్నారు. ఈ విషయమై అటవీశాఖ అధికారులను వివరణ కోరగా అలాంటిదేమీ లేదని అంటూనే సమాచారం సేకరిస్తున్నామని చెబుతున్నారు.
 
							నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
