 
															సమీకృత వ్యవసాయమే భేష్
● తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం ● కలెక్టర్ జితేష్ వి పాటిల్
బూర్గంపాడు: వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలను సమ్మిళతం చేసి రైతులు సమీకృత వ్యవసాయ విధానాలను పాటించాలని, దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సూచించారు. మోరంపల్లిబంజర గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న మోడల్ డెమో ఫామ్ షెడ్ నిర్మాణ పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతులు పంటలతో పాటు పశుపోషణ, కూరగాయలు, పూల మొక్కలు, పండ్లతోటల పెంపకం, కోళ్లు, కౌజు పిట్టలు, చేపలు, మేకల పెంపకం వంటి పనులు చేపట్టాలని సూచించారు. తద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఇలాంటి మోడల్ ఫామ్‌షెడ్‌లు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతులను ఈ దిశగా ప్రోత్సహించేందుకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ ఈసీ రాజు, అధికారులు వెంకయ్య, వెంకటలక్ష్మి, హేమంతిని, పంచాయతీ కార్యదర్శి భవాని పాల్గొన్నారు.
వైద్య విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలి
చుంచుపల్లి : వైద్య విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. కొత్తగూడెంలోని ప్రభుత్వ వైద్య కళాశాలను గురువారం ఆయన సందర్శించారు. నిర్మాణంలో ఉన్న హాస్టల్ భవనాన్ని పరిశీలించి, పనుల్లో నాణ్యత పాటించాలని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కళాశాల చుట్టూ ప్రహరీ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సూచించారు. వైద్య విద్యార్థుల భవిష్యత్ దేశ ఆరోగ్య రక్షణకు పునాది అవుతుందని, వారికి తగిన సౌకర్యాలు కల్పించాలని అన్నారు. కళాశాల ఆవరణలో మొక్కలు నాటలని, విద్యార్థుల్లో పర్యావరణ స్ఫూర్తి పెంపొందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు సులభంగా కళాశాలకు చేరుకునేలా బస్సు ఏర్పాటుకు ఆర్టీసీ అధికారులతో చర్చిస్తామని చెప్పారు. లెక్చరర్ గ్యాలరీ ఏర్పాటు చేయాలని సిబ్బంది కోరగా త్వరలోనే అమలు చేసేలా చర్యలు చేపడతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వైద్య కళాశాల వైస్ ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, డాక్టర్ సురేష్ బాబు, వార్డెన్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
