 
															వృద్ధులకు ఇబ్బంది లేకుండా చూడాలి
జిల్లా సంక్షేమాధికారి స్వర్ణలతా లెనీనా
అశ్వాపురం/మణుగూరురూరల్ : వృద్ధులకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని, వారికి ఏ విధమైన ఇబ్బంది కలగనీయొద్దని జిల్లా సంక్షేమాధికారిణి స్వర్ణలతా లెనీనా అన్నారు. అశ్వాపురం, సీతారాంపురంలోని వృద్ధాశ్రమాలను గురువారం ఆమె సందర్శించారు. పడకగదులు, సామగ్రి, వంటగది, భోజనశాలలను పరిశీలించారు. ఆశ్రమాల నిర్వహణకు నిధులు ఎలా సమకూరుస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఆశ్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో మానవీయ వృద్ధాశ్రమం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి రమేశ్‌బాబు, కమటం వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు దైదా నారాయణరెడ్డి, అరిఫా అండ్ రోష్ని వృద్ధాశ్రమం నిర్వాహకురాలు షహనాజ్ బేగం తదితరులు పాల్గొన్నారు.
శ్రీసత్యసాయి పాఠశాలలో తనిఖీ..
మణుగూరు మండలం సంతోష్‌నగర్‌లో సింగరేణి సేవా సమితి సహకారంతో నిర్వహిస్తున్న శ్రీసత్యసాయి పాఠశాలను స్వర్ణలతా లెనీనా గురువారం తనిఖీ చేశారు. ప్రత్యేకావసరాలు గల పిల్లలకు కల్పిస్తున్న వసతి, విద్యాబోధన, క్రీడల వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. స్పీచ్ థెరపీ ద్వారా విద్యాభోదన చేయడాన్ని చూసి నిర్వాహకులు, ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ టి. శ్రీనివాసరావు, ఎంపీఓ పి.వెంకటేశ్వరరావు, పాఠశాల నిర్వాహకులు టి.నాగమణి, దుర్గా వరప్రసాద్, ఉపాధ్యాయురాలు రోజారమణి పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
