 
															ముమ్మరంగా వాహన తనిఖీలు
టేకులపల్లి: మావోయిస్టుల నిరసన నేపథ్యంలో టేకులపల్లి సర్కిల్ పోలీసులు అప్రమత్తమయ్యారు. బుధవారం ఎస్పీ రోహిత్‌రాజు ఆదేశాల మేరకు బోడు ఎస్‌ఐ పోలిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బోడు పోలీస్ స్టేషన్ పరిధిలోని సంపత్‌నగర్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానితుల వివరాలు ఆరా తీశారు. ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, ధ్రువపత్రాలను తనిఖీ చేశారు.
రేపు జాబ్‌మేళా
సూపర్‌బజార్(కొత్తగూడెం): హైదరాబాద్‌లోని వివిధ తయారీ రంగ సంస్థల్లో పనిచేసేందుకు గాను 200 మంది ఎంపిక కోసం ఈ నెల 24న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. పాల్వంచలోని డిగ్రీ కళాశాలలో జరిగే జాబ్‌మేళాను 19 నుంచి 23 ఏళ్ల వయస్సు కలిగిన నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రికల్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్టు, వెల్డర్ ట్రేడ్లలో ఐటీఐ పూర్తిచేసిన వారు టెక్నీషియన్లుగా అర్హులని, ట్రెయినీ టెక్నీషియన్లుగా పదో తరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ చేసిన వారు అర్హులని వెల్లడించారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మొదలయ్యే ఇంటర్వ్యూలకు అన్ని ధ్రువపత్రాలతో హాజరుకావాలని, వివరాలకు 90105 84000 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
బీఏఎస్ స్కూళ్లలో ఖాళీల భర్తీకి దరఖాస్తులు
సూపర్‌బజార్(కొత్తగూడెం): బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం కింద కొనసాగుతున్న పాఠశాలల్లో ఖాళీల భర్తీకి ఎస్సీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఎ.శ్రీలత తెలిపారు. వివిధ తరగతుల్లో రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ నుంచి 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఒకే విద్యార్థికి అవకాశం ఉండగా, తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు దాటని వారు అర్హులని తెలిపారు. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్, మీ సేవ ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ, నివాస పత్రాలు, బోనఫైడ్ సర్టిఫికెట్, రెండు ఫొటోలతో నవంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 6న లాటరీ ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.
ట్రాక్టర్ డ్రైవర్ మృతి
ములకలపల్లి: అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ఆలయాన్ని ఢీకొట్టడంతో డ్రైవర్ మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సారపాక గ్రామానికి చెందిన భూక్యా లక్ష్మణ్ ట్రాక్టర్‌ను అదే గ్రామానికి చెందిన ముత్యాల శేఖర్ (50) నడుపుతున్నాడు. బుధవారం మండలంలోని కొత్తజిన్నెలగూడెం సమీపంలో జామాయిల్ కర్ర తీసుకెళ్లేందుకు శేఖర్ ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్నాడు. మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఆలయాన్ని ఢీకొట్టింది. శేఖర్ ట్రాక్టర్ పైనుంచి కిందపడ్డాడు. స్థానికులు 108 ద్వారా పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య పార్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ పుల్లారావు తెలిపారు.
దాడి చేసిన వ్యక్తి
రిమాండ్
పాల్వంచ: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌పై రాళ్లతో దాడిచేసి గాయపర్చిన వ్యక్తిని పోలీసులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నెల 15వ తేదీ రాత్రి జయమ్మకాలనీలో గొడవ జరుగుతోందని సమాచారం రావడంతో కానిస్టేబుల్ అబ్బురాములు అక్కడికి వెళ్లగా.. జట్‌పట్ రమేశ్ రాళ్లతో దాడి చేసి గాయపర్చాడు. అబ్బురాములు ఫిర్యాదు మేరకు రమేశ్‌పై కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ సుమన్ పేర్కొన్నారు.
మద్యం దుకాణం వద్ద ఘర్షణ
ఆరుగురిపై కేసు
పాల్వంచరూరల్: మద్యం దుకాణం వద్ద మద్యం సేవిస్తున్న యువకుల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. యువకుడిపై ఆరుగురు కలిసి దాడిచేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని పెద్దమ్మగుడి వద్ద గల మద్యం దుకాణం వద్ద నాగారానికి చెందిన ఐలపాక హరీశ్‌పై శనగ కిశోర్, అఖిల్, భరత్, సందీప్, హరిబాబు, సాగర్ కలిసి బుధవారం దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
