 
															స్వామివారి సేవల్లో
ఆలయ అభివృద్ధిలో దాతల పాత్ర ఎనలేనిది
వితరణశీలురకు శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఘన సత్కారం
గౌరవ మర్యాదలకు లోటు రానివ్వబోమని అధికారుల హామీ
సముచితస్థానం..
‘అందరి బంధువు రామయ్యపై భక్తితో విరాళాలు, వితరణలు చేశాం. స్వామివారి సేవల్లో సముచిత స్థానం, ప్రాధాన్యం కల్పించండి.’ అంటూ పలువురు దాతలు ఆలయ అధికారుల ఎదుట ఆవేదన చెందారు. శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానానికి, శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి, గోశాల, ఇతర అభివృద్ధి పనులకు ఏళ్లుగా సహకరిస్తున్న దాతలను బుధవారం సన్మానించారు. 2023లో అప్పటి ఈఓ రమాదేవి ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టగా, అదే ఆనవాయితీని ప్రస్తుత ఈఓ దామోదర్‌రావు కొనసాగించారు. 1,340 మంది దాతలు ఉండగా, సన్మాన కార్యక్రమానికి 120 మంది కుటుంబ సభ్యులతో హాజరయ్యారు. –భద్రాచలం
ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి
మారుతి సదనంలో జరిగిన కార్యక్రమంలో దాతలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు దాతలు తమ అభిప్రాయాలను ఈఓ, వైదిక పెద్దల ముందు వెలిబుచ్చారు. దేవస్థానంలో దర్శనాల్లో ప్రొటోకాల్ అమలుపర్చాలని కోరారు. అంతరాలయంలో దర్శనానికి ప్రత్యేక క్యూలైన్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. దేవస్థానంలో ప్రధానమైన శ్రీరామనవమి, ముక్కోటి ఉత్సవాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని కోరారు. దేవస్థానం కార్యాలయ ఆవరణలో దాతలకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. బుధవారం సైతం దర్శనంలో తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని, దాతలకు ఇదేనా అందే మర్యాద..? అని కొత్తగూడేనికి చెందిన ఓ మహిళా దాత ప్రశ్నించారు. దీంతో వైదిక పెద్దలు, ఆలయ అధికారులు ఆమెకు సర్ది చెప్పారు.
–ఈవో దామోదర్‌రావు
స్వామివార్ల సేవల్లో దాతలకు సముచిత స్థానం కల్పిస్తామని ఆలయ ఈఓ కొల్లు దామోదర్‌రావు అన్నారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అర్చకులు స్వామివార్లకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఈవో దామోదర్ రావు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధిలో దాతల పాత్ర ఎనలేనిదని అన్నారు. శాశ్వత నిత్యాన్నదానం, గోశాల, బంగారు, వెండి వాకిలి ఏర్పాటు, ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల కోసం ఏర్పాటు చేసిన వసతులన్నీ దాతల సహాయ సహకారాలతో పూర్తి చేయగలిగామన్నారు. ఇదే స్ఫూర్తితో దాతలకు ఆలయ అభివృద్ధికి చేయూతనందించాలని కోరారు. దాతలకు దేవస్థానంలో ఎటువంటి లోటులేకుండా తగిన గౌరవ మర్యాదలను అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం దాతలను ఘనంగా సత్కరించారు. దాతలందరికీ స్వామివారి అన్నదాన ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు శ్రావణ్‌కుమార్, భవానీ రామకృష్ణ, ఈఈ రవీందర్, స్థానాచార్యులు స్థలశాయి, ప్రధాన అర్చకులు, పండితులు, అర్చకులు, దాతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఉత్సవాల్లోనూ ప్రాధాన్యం
ఇవ్వాలని దాతల సూచన
 
							స్వామివారి సేవల్లో
 
							స్వామివారి సేవల్లో

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
