మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలి

Oct 23 2025 2:32 AM | Updated on Oct 23 2025 2:32 AM

మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలి

మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలి

క్రమశిక్షణతో కూడిన విద్యనందించాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలని, డ్రగ్స్‌ వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఎస్పీ రోహిత్‌ రాజుతో కలిసి జిల్లాస్థాయి నార్కోటిక్‌ కంట్రోల్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. నమోదవుతున్న కేసులు, గంజాయి సాగు, రవాణా నివారణ చర్యలు, మాదక ద్రవ్యాల వాడకం, శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, డ్రగ్స్‌ వల్ల కలిగే నష్టాలపై చేపట్టాల్సిన అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ బాధితులను గుర్తించి డీఅడిక్షన్‌ సెంటర్‌ ద్వారా చికిత్స, కౌన్సెలింగ్‌ అందించాలని ఆదేశించారు. ఆస్పత్రులు, మెడికల్‌ షాపులను ప్రతీ నెల తనిఖీ చేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ఇంటర్‌ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఎస్పీ రోహిత్‌రాజు మాట్లాడుతూ జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చైతన్యం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్డన్‌ సెర్చ్‌, సైకిల్‌ ర్యాలీ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలోని మొట్టమొదటిసారిగా రవాణా చేస్తూ పట్టుబడిన వారిపై పీఅండ్‌పీఎస్‌ కేసులు నమోదు చేస్తామని, రాబోయే రెండు వారాల్లో ఇది అమల్లోకి వస్తుందన్నారు. సమావేశంలో ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను, ఇంటర్మీడియట్‌ అధికారి వేంకటేశ్వరరావు, జిల్లా వైద్యాధికారి జయలక్ష్మి, ఆర్‌టీఓ వెంకటరమణ పాల్గొన్నారు.

విమానాశ్రయానికి స్థలసేకరణ..

జిల్లా కేంద్రంలో ప్రతిపాదనలో ఉన్న విమానాశ్రయం ఏర్పాటుకు స్థలసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. మంగళవారం రాత్రి ఆయన కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ను కలెక్టరేట్‌లో కలిసి పలు అంశాలను విన్నవించారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఇండస్ట్రియల్‌ పార్కు, క్రీడా స్టేడియం నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతులు లభించాయని, స్థలం సమస్య తలెత్తకుండా చొరవతీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. వేర్‌ హౌస్‌ కార్పొరేషన్‌ గౌడౌన్ల నిర్మాణంకోసం 10 ఎకరాల స్థలం మంజూరు చేయాలని, ఆటో నగర్‌ కోసం అందుబాటులో ఉన్న ఖాళీస్థలాలు కేటాయించాలని, కేంద్రీయ విద్యాలయను త్వరితగతిన ప్రారంభించాలని కోరినట్లు వివరించారు.

రుణ బకాయిలు వసూలు చేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/చుంచుపల్లి: జిల్లాలో రుణ బకాయిలను ప్రణాళికాబద్ధంగా వసూలు చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సెర్ప్‌ ఏపీఎంలు, సీసీలతో నిర్వహించిన సమగ్ర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. లైవ్‌హుడ్‌ యూనిట్ల ఏర్పాటుకు స్థలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. చేపలు, కౌజు పిట్టలు, మేకలు, నాటు కోళ్ల పెంపకం వంటి యూనిట్లను ఒకే షెడ్‌లో నిర్వహించడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. సమగ్రత వ్యవసాయం ద్వారా రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు లాభం పొందవచ్చని అన్నారు. రాబోయే 15 రోజుల్లో ప్రతీ సీసీ మోడల్‌ యూనిట్లను స్థాపించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెలాఖరుకు జిల్లా వ్యాప్తంగా 100 కొర్ర మీను చేపల పెంపకం యూనిట్ల స్థాపనకు మహిళా సమాఖ్య గ్రూపులను గుర్తించి రుణ సహాయం కల్పించాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ విద్యా చందన, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ రామిరెడ్డి, సెర్ప్‌ ఏపీఎంలు, క్లస్టర్‌ కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు.

కొత్తగూడెంఅర్బన్‌/చుంచుపల్లి: విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యనందించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సూచించారు. బుధవారం కొత్తగూడెం బాబు క్యాంపు ప్రాంతంలోని పీఎం శ్రీ ప్రభుత్వ హైస్కూల్‌, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, భవిత కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పీఎం శ్రీ పథకం ద్వారా ప్రతీ పాఠశాలను ఉత్తమ ప్రమాణాలతో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మాత, శిశు ఆరోగ్య పరిరక్షణ, పిల్లలలో మానసిక, శారీరక వికాసం సాధించేందుకు ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయాలని భవిత కేంద్రం అధికారులను ఆదేశించారు.

కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement