 
															చెక్ పోస్టులు సర్దేశారు..
పాల్వంచ, అశ్వారావుపేటల్లో ఆర్టీఏ తనిఖీ కేంద్రాల ఎత్తివేత
సామగ్రి జిల్లా కార్యాలయానికి తరలించిన అధికారులు, సిబ్బంది
అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఇటీవలే ఏసీబీ దాడులు
పాల్వంచరూరల్/అశ్వారావుపేటరూరల్: రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీ పరిధిలోని అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను తొలగించారు. బుధవారం సాయంత్రం సామగ్రి సర్దుకుని అధికారులు, సిబ్బంది వెళ్లిపోయారు. తనిఖీలకు ఆన్‌లైన్ విధానం అమల్లో భాగంగా రెండు నెలల క్రితం ప్రభుత్వం జీఓ నంబర్ 58ను జారీచేసింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ చెక్‌పోస్టులను యుద్ధప్రాతిపదికన మూసివేయాలని బుధవారం ఆదేశాలు జారీచేసింది. దీంతో జిల్లాలోని పాల్వంచ, అశ్వారావుపేట ప్రాంతాల్లో ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్టులను సంబంధిత అధికారులు మూసివేశారు. చెక్ పోస్టుల్లో 24 గంటలపాటు వాహన తనిఖీలు నిర్వహించేవారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలకు సంబంధించిన పర్మిట్లు, ట్యాక్సీ చెల్లింపులు, లోడింగ్‌లను తనిఖీ చేసేవారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై కేసు నమోదు చేయడంతోపాటు జరిమానా విధించేవారు. కాగా చెక్‌పోస్టుల్లో ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఆర్టీఏ అధికారులు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడంతో ఇటీవల ఏసీబీ అధికారులు కూడా దాడులు నిర్వహించారు.
ఆనవాళ్లు లేకుండా..
చెక్‌పోస్టుల వద్ద బోర్డులను కూడా తొలగించారు. పేరు కన్పించకుండా నల్లటి రంగు వేశారు. కంప్యూటర్లు, స్టేషనరీ, ఫర్నిచర్, ఏసీలు, బీరువాలను సర్దుకుని ప్రత్యేక వాహనంలో కొత్తగూడెం ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు. కొత్తగూడెం జిల్లా ట్రాన్స్‌పోర్టు అధికారి వెంకటరమణ పాల్వంచ చెక్‌పోస్టును పరిశీలించి వెళ్లారు. చెక్‌పోస్టు తొలగింపు ఆదేశాలు వెలువడిన గంటల వ్యవధిలోనే కార్యాలయాలు వెలవెలబోయాయి. మరోవైపు చెక్‌పోస్టులను తొలగించడం పట్ల వాహనదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
పాల్వంచలో 35 ఏళ్ల క్రితం ఏర్పాటు
పాల్వంచలో 35 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన ఆర్టీఏ చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. 1992లో మొదటిసారిగా పాల్వంచ పట్టణంలోని జీసీసీ కార్యాలయం పక్కన ఏర్పాటు చేశారు. 2010లో అక్కడి నుంచి జగన్నాథపురం శివారు నాగారం కాలనీ వద్దకు తరలించారు. అప్పటి నుంచి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, నలుగురు ఏఎంవీఐలు, మరో నలుగురు కానిస్టేబుళ్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ విధులు నిర్వర్తిస్తున్నారు. గతేడాది చెక్‌పోస్టులో 1600 కేసులను నమోదు చేశారు. జరిమానా ద్వారా ప్రభుత్వానికి రూ. 2.5 కోట్ల ఆదాయం లభించింది. బుధవారం సాయంత్రం 5 గంటలకు నాగారంకాలనీ వద్దగల చెక్‌పోస్టును పూర్తిగా ఎత్తివేశారు.
సరిహద్దులో 11 ఏళ్ల క్రితం..
ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రవాణా శాఖ ఆధ్వర్యంలో అశ్వారావుపేటలో జాతీయ రహదారిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్‌పోస్టును బుధవారం మూసివేశారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సరిహద్దులో 2014లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు దాదాపు 11 ఏళ్లు కొనసాగింది. చెక్‌పోస్టు ద్వారా ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు రూ.8 కోట్ల ఆదాయం వస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో చెక్ పోస్టును తొలగించినట్లు ఎంవీఐ జనార్ధన్ రెడ్డి తెలిపారు. కాగా, పొరుగున ఉన్న ఏపీ సరిహద్దు చెక్‌పోస్టును వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనే ఎత్తివేశారు.
ప్రభుత్వ, ఉన్నతాధికారుల ఆదేశాలతో పాల్వంచలోని ఆర్టీఏ చెక్‌పోస్టును మూసివేశాం. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది వరంగల్‌లోని డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ వద్ద గురువారం రిపోర్టు చేయాలి. చెక్‌పోస్టు ఆనవాళ్లు లేకుండా తొలగించాం.
–మనోహర్, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్
 
							చెక్ పోస్టులు సర్దేశారు..
 
							చెక్ పోస్టులు సర్దేశారు..

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
