 
															సింగరేణిలో టెండ‘రింగ్’
నిబంధనల ప్రకారమే టెండర్లు...
● ఒకే సంస్థకు లబ్ధి చేకూర్చేలా నిబంధనలు ● కొత్త కంపెనీలను  పోటీలోకి రానివ్వని వైనం ● సంస్థ ఫారెస్ట్ విభాగంపై ఆరోపణలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భూగర్భ గనుల్లో బొగ్గు వెలికి తీసినప్పుడు ఆ ప్రాంతంలో ఖాళీ ఏర్పడుతుంది. ఈ ఖాళీ స్థలం కుంగుబాటుకు గురికాకుండా ఉండేందుకు కలప దుంగలను నిలబెట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ ఏరియాలో యూకలిప్టస్(జామాయిల్) చెట్లను వందల ఎకరాల్లో సింగరేణి సంస్థ పెంచుతోంది. ఏపుగా పెరిగిన చెట్లను సంస్థ అవసరాల కోసం నరికి దుంగలుగా మారుస్తారు. డిమాండ్‌కు సరిపడా కలప సొంత ప్లాంటేషన్లలో లభ్యత లేకపోతే టెండర్ల ద్వారా బయట నుంచి తీసుకోవడం ఆనవాయితీ. ఈ పనులన్నీ నిర్వహించేందుకు ప్రత్యేకంగా సింగరేణిలో ఫారెస్టు విభాగం ఉండగా.. ప్రధాన టెండర్లలో పోటీ నామ్ కే వాస్తేగా మారిందనే విమర్శలు వస్తున్నాయి.
తూతూ మంత్రంగా...
ఏదైనా పని చేసేందుకు వివిధ సంస్థలు పోటీ పడడం.. తద్వారా తక్కువ ధరకు నాణ్యమైన పనులు చేయించుకునేందుకు అన్ని ప్రభుత్వ శాఖల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తారు. కేవలం ఒకే సంస్థ టెండర్ దాఖలు చేస్తే రద్దు చేసి మరోమారు పిలవడం అన్ని చోట్ల జరుగుతుంది. కానీ సింగరేణి ఫారెస్టు విభాగంలో ఈ స్ఫూర్తి కనిపించడం లేదు. ఏదో తప్పదు అన్నట్లుగా టెండర్లు పిలవడం, అందులో పేర్కొనే అర్హత నిబంధనలు అన్నీ ఒక కంపెనీ లేదా ఒక కాంట్రాక్టర్‌కు అనుగుణంగా ఉండేలా చూస్తున్నారనే ఆరోపణలు కొన్నేళ్లుగా వస్తున్నాయి. దీనిపై గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. అప్పటి నుంచి టెండర్ల ప్రక్రియలో కొత్త కంపెనీలు కూడా పోటీకి దిగుతున్నాయి. కానీ ఇందులో కనీసం నాలుగు కంపెనీలు వరుసగా పనులు దక్కించుకుంటున్నాయి. ఇదేమిటని ఆరా తీస్తే బడా కాంట్రాక్టరే రకరకాల పేర్లతో టెండర్లు వేస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తద్వారా టెండర్ ప్రక్రియలో అనధికారిక రింగ్ జరుగుతుందనే విమర్శలు కొసాగుతున్నాయి.
కొత్త వారు రాకుండా...
రామగుండం ఏరియాలో అవసరాల దృష్ట్యా నిర్ణీత ప్రమాణాల ప్రకారం రెండు లక్షల కలప దుంగల కోసం ఇటీవల సింగరేణి ఫారెస్ట్ విభాగం టెండర్లు ఆహ్వానించింది. ఇందులో పాల్గొనేందుకు పలు సంస్థలు చూపాయి. అయితే గతంలో లక్ష దుంగలకు పైగా సరఫరా చేసిన కంపెనీలే పాల్గొనేందుకు అర్హులు అంటూ నిబంధన చేర్చారు. ఈ కొత్త నిబంధన తమకు ప్రతికూలంగా మారిందని కొత్తగా టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు సిద్ధమైన సంస్థలు చెబుతున్నాయి. కొత్త వారు రాకుండా అడ్డుకోవ డం, పాత వారికి మేలు చేయాలనే తపనతో ‘లక్ష’ నిబంధనలు చేర్చారని విమర్శిస్తున్నారు. ఫారెస్టు విభాగంలో కొందరు అధికారులు కేవలం ఒక కాంట్రాక్టు సంస్థకు లబ్ధి చేకూర్చేందుకే ఇలా చేశారని చెబుతున్నారు. తద్వారా ఏటా సంస్థకు రూ.కోట్లల్లో నష్టం జరుగుతోందనే ప్రచారం ఉంది. ఈ విషయమై ఉన్నతాధికారులు దృష్టి సారించి సంస్థ సొమ్ము పక్కదారి పట్టకుండా చూడాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
సింగరేణిలో కర్ర సేకరణకు నిబంధనల ప్రకారమే టెండర్లు నిర్వహించాం. ఇందులో పొందుపర్చిన అర్హతలు ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు. కొన్నేళ్లుగా ఒకరికే కేటాయిస్తున్నారనే ప్రచారంలో నిజం లేదు. దాఖలైన టెండర్లన్నీ పరిశీలించాక అర్హతల మేరకు అధికారుల ఆమోదంతో కేటాయిస్తున్నాం. తాజా టెండర్ల ఖరారుకు ఇంకా మూడు వారాలు పడుతుంది. – అభిలాష్,
సింగరేణి ఫారెస్ట్ విభాగం మేనేజర్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
