 
															సిటిజన్ సర్వేలో పాల్గొనండి
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ – 2047’ సర్వేలో ప్రజలంతా పాల్గొనాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ప్రభుత్వం ఈ సర్వే చేపట్టిందని తెలిపారు. ఈనెల 25వ తేదీ వరకు గడువు ఉన్నందున ప్రజలు www. telangana.gov.in /telanganarising వెబ్‌సైట్ ద్వారా తమ సలహాలు ఇవ్వాలని కలెక్టర్ ఓ ప్రకటనలో సూచించారు.
విద్యార్థులకు పోటీ పరీక్షల పుస్తకాలు
భద్రాచలంటౌన్: గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేలా అవసరమైన పుస్తకాలను భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ట అందజేశారు. జేఈఈ, నీట్‌తో పాటు హోటల్ మేనేజ్‌మెంట్ పరీక్షలకు సిద్ధం కావడానికి సరైన పుస్తకాలు లేవని భద్రాచలం గిరిజన కళాశాల విద్యార్థులు ఇటీవల సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వివిధ రకాల పుస్తకాలు తెప్పించి మంగళవారం విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా మ్రినాల్ శ్రేష్ట మాట్లాడుతూ విద్యార్థులకు పాఠ్యాంశాలు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని, తద్వారా మెరుగైన భవిష్యత్ సొంతమవుతుందని తెలిపారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
