 
															‘ఆయిల్‌ఫెడ్’ జీఓ ప్రతులు దహనం
దమ్మపేట: తెలంగాణ ఆయిల్‌ఫెడ్ ఇటీవల విడుదల చేసిన జీఓ ప్రతులను తెలంగాణ రైతు సంఘం(ఏఐకేఎస్) ఆధ్వర్యంలో ఆదివారం దహనం చేశా రు. ఆయిల్‌ఫెడ్‌కు సంబంధించిన పామాయిల్ ఫ్యాక్టరీలు, నర్సరీల్లోకి ఉన్నతాధికారుల అనుమతి లేకుండా రైతులు, మీడియా, ఇతరులు ప్రవేశించేందుకు వీలులేదంటూ జీఓ జారీ చేశారు. ఆ జీఓను వ్యతిరేకిస్తూ దమ్మపేటలో ర్యాలీ, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు సత్యనారాయణ, కొక్కెరపాటి పుల్లయ్యలు మాట్లాడుతూ ఆయిల్‌ఫెడ్ జారీ చేసిన జీఓ బ్రిటీష్ కాలం నాటి నిర్బంధ చట్టాలను గుర్తుకు తెస్తోందని అన్నారు. పామాయిల్ నర్సరీలో నాణ్యతలేని నకిలీ మొక్కలను పెంచి రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఫ్యాక్టరీల్లో జరిగే అవినీతి, కుంభకోణాలు బయటకు రాకుండా ఉండేందుకే ఇలాంటి జీఓ ఇచ్చారని అన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధ్యత వహించి జీఓ ఉపసంహరించుకోవాలని కోరారు. పామాయిల్ అత్యధికంగా పండుతున్న అశ్వారావుపేట నియోజకవర్గంలోనే రిఫైనరీ ఫ్యాక్టరీ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దొడ్డా లక్ష్మీనారాయణ, మోరంపూడి శ్రీనివాసరావు, రావుల శోభన్‌బాబు, కొలికపోగు శ్రీనివాసరావు, యండ్రాతి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
