 
															బీసీ రిజర్వేషన్లపై తప్పుడు రాజకీయాలు
కరకగూడెం: బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు రాజకీయాలు చేస్తోందని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం కుర్నవల్లిలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాపాలనలో ప్రజల కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయే కాని పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పసలేని కేసులు పెడుతూ కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుతోందని, కేవలం మాజీ సీఎం కేసీఆర్‌ను బదనాం చేయడానికే పాలన కొనసాగిస్తున్నట్లుగా ఉందని విమర్శించారు. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీబీఐ సంస్థలను మోదీ జేబు సంస్థలని విమర్శిస్తుంటే, మరోవైపు రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోరడం ఆ పార్టీ ద్వంద్వ ప్రమాణాలను తేటతెల్లం చేస్తుందన్నారు. కాగా, రానున్న రోజులన్నీ తమవేనని, పార్టీ కార్యకర్తలందరూ గ్రామాల్లో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గుర్తించి అక్కడే డిజిటల్ క్యాంపెయిన్ చేయాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, నాయకులు అక్కిరెడ్డి వెంకటరెడ్డి, బైరిశెట్టి చిరంజీవి, రేగా సత్యనారాయణ, లక్క మధు, కొమరం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
