
హ్యామ్‌తో మహర్దశ
ప్రజలపై భారం పడకుండా
ప్రభుత్వ, ప్రైవేటు భాగాస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో గతంలో కొన్ని రోడ్ల నిర్మాణం జరిగేది. అభివృద్ధి పనులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు చేపడతాయి. ఆ తర్వాత నిర్మాణ వ్యయాన్ని వినియోగదారుల(ప్రజలు) నుంచి నిర్ణీత కాలానికి టోల్‌గేట్లు, ఇతర పద్ధతుల ద్వారా వసూలు చేసుకుంటాయి. వ్యయానికి సరిపడా రాబడి వచ్చిన తర్వాత సదరు ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తాయి. వినియోగదారులపై ఆర్థిక భారం పడుతుండడంతో ఈ విధానంపై విమర్శలు వస్తుండగా.. ఈ భారాన్ని తగ్గిస్తూ కొత్తగా హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) పద్ధతిని అమల్లోకి తీసుకొచ్చారు. ఇందులో నిర్మాణ వ్యయంలో ప్రభుత్వం 40 శాతం భరిస్తే మిగిలిన 60 శాతాన్ని నిర్మాణ సంస్థ (కాంట్రాక్టర్) భరిస్తారు. అయితే ప్రైవేటు సంస్థ భరించిన వ్యయాన్ని పదిహేనేళ్లలో విడతల వారీగా ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీని వల్ల వినియోగదారులపై ఆర్థిక భారం పడదు. సులభ వాయిదాల్లో నిర్మాణ వ్యయాన్ని చెల్లించే వీలు ప్రభుత్వానికి ఉంటుంది.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రానికి, జిల్లా కేంద్రాల నుంచి రాష్ట్ర రాజధానికి వెళ్లే రోడ్లను హ్యామ్ (హైబ్రిడ్ యాన్యూటీ మోడల్) విధానంలో విస్తరణ, అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా అభివృద్ధి చేయబోయే రోడ్ల వివరాలను రహదారులు, భవనాల శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 373 రోడ్లను హ్యామ్‌లో అభివృద్ధి చేయనుండగా.. జిల్లాకు చెందిన పది రోడ్లకు అవకాశం దక్కినట్టుగా ప్రకటించారు. ఈ పదింటిలో మొత్తం 266 కి.మీ నిడివి కలిగిన పలు రోడ్ల అభివృద్ధికి అవకాశం ఏర్పడింది. ఇందుకోసం రూ.380 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇందులో 40 శాతం వ్యయం రాష్ట్ర ప్రభుత్వం, 60 శాతం నిర్మాణ పనులు దక్కించుకున్న సంస్థ భరించనున్నాయి.
పేరుకే పది.. చేసేది ఐదే..
హ్యామ్ విధానంలో అభివృద్ధి చేసే వాటిలో ప్రధానంగా కొత్తగూడెం – తల్లాడ, అనిశెట్టిపల్లి – ఆళ్లపల్లి, దమ్మపేట – పాల్వంచ, బూర్గంపాడు – దుగినేపల్లి (ఏటూరునాగారంరోడ్డు), పాల్వంచ (ఏపీ స్టీల్స్) – పినపాక పట్టీనగర్ రోడ్లు ఉన్నాయి. ఈ పథకం కింద జిల్లాలో పది రోడ్లను అభివృద్ధి చేయబోతున్నట్టు అధికారులు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అవి ఐదు రోడ్లుగానే ఉన్నాయి. ప్రతీ పనిని నియోజకవర్గాల వారీగా విభజించడంతో ఈ ఐదు రోడ్లనే పది రహదారులుగా చూపిస్తున్నారు. అభివృద్ధి చేయబోయే రోడ్లలో అత్యధికంగా పినపాక నియోజకవర్గం పరిధిలో 75.20 కి.మీ. నిడివి ఉండగా అత్యల్పంగా ఇల్లెందు నియోజకవర్గం పరిధిలో 25 కి.మీ. నిడివి ఉంది. భద్రాచలం నియోజకవర్గానికి హ్యామ్ స్కీమ్‌లో అసలు చోటే దక్కలేదు.
ఏజెన్సీ రోడ్లకు స్థానం..
హ్యామ్ పథకం కింద ఎంపిక చేసిన రోడ్లలో కొత్తగూడెం–తల్లాడ, బూర్గంపాడు–ఏటూరునాగారం, దమ్మపేట–పాల్వంచ రోడ్లను జాతీయ రహదారులుగా మర్చాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఈ రోడ్లు హ్యామ్ పథకంలో కాకపోయినా రేపో మాపో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(నాయ్) ద్వారా అయినా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కానీ, హ్యామ్‌లో కొత్తగా చేర్చిన ఆళ్లపల్లి–అనిశెట్టిపల్లి (వయా తిర్లాపురం, ఆనంతోగు, సిద్దారం, గంగారం), పా ల్వంచ–పినపాక పట్టీనగర్ క్రాస్ రోడ్ (వయా సీతారాంపట్నం, కేటీపీఎస్, పాండురంగాపురం, ఉప్పుసాక) రో డ్లు పూర్తిగా ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నా యి. ఈ రహదారుల విస్తరణ జరిగితే ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన రవా ణా సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
జిల్లాలో పది రోడ్ల అభివృద్ధి, విస్తరణ
మొత్తంగా 266 కి.మీ. రహదారులకు మోక్షం
నిర్మాణ వ్యయం అంచనా రూ.380 కోట్లు
దశ మారనున్న ఆళ్లపల్లి – కొత్తగూడెం రోడ్డు
రోడ్డు నిడివి(కి.మీ.) లబ్ధిపొందే నియోజకవర్గాలు
కొత్తగూడెం – తల్లాడ 36 కొత్తగూడెం, వైరా, సత్తుపల్లి
దమ్మపేట – పాల్వంచ 59 కొత్తగూడెం, అశ్వారావుపేట
బూర్గంపాడు – ఏ.నాగారం 58.20 పినపాక
పాల్వంచ – పి.పట్టీనగర్ 10 కొత్తగూడెం, పినపాక
అనిశెట్టిపల్లి – ఆళ్లపల్లి 25 ఇల్లెందు, పినపాక