
వర్షాలతో అప్రమత్తంగా ఉండాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ ప్రవాహ సమయంలో నదులు, కాల్వలు, చెరువుల వద్దకు వెళ్లొద్దని, దాటేందుకు ప్రయత్నించొద్దని సూచించారు. తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులకు అవసరమైన సూచనలు చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా నిలిచినా ఆస్పత్రుల్లో అత్యవసర సేవలకు అంతరాయం వాటిల్లకుండా వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నెలలు నిండిన గర్భిణులను ముందుగానే ఆస్పత్రులకు చేర్చాలని తెలిపారు.
ఆన్‌లైన్ తరగతులు వినియోగించుకోవాలి
పాల్వంచ: రాష్ట్ర ప్రభుత్వం, ఖాన్ అకాడమీ సంయుక్త నిర్వహణలో కేజీబీవీ విద్యార్థులకు 6 నుంచి 12వ తరగతి వరకు భౌతిక, రసాయన శాస్త్రాలు, గణిత సబ్జెక్టుల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పాటిల్ సూచించారు. పాల్వంచ కేజీబీవీని గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లలకు అవసరమైన పుస్తకాలు, కంప్యూటర్లు తెప్పించుకోవాలని, వాటి జాబితా తనకు అందిస్తే అవసరమైన కంప్యూటర్లు పంపిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలకు అవసరమైన వసతుల విషయంలో రాజీపడకుండా అన్ని వస్తువులు సమకూర్చాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని డీఈఓ వెంకటేశ్వరాచారిని ఆదేశించారు. మోడల్ కేజీబీవీగా అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉంచేలా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, సీఎంఓ ఎస్‌కే.సైదులు, బాలికా విద్య కో ఆర్డినేటర్ జె.అన్నామణి, తహసీల్దార్ దారా ప్రసాద్, కేజీబీవీ ప్రత్యేకాధికారి తులసీ విద్యాసాక్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ జితేష్ వి పాటిల్