
నిండు కుండల్లా చెరువులు
పాల్వంచరూరల్/ఇల్లెందు/ఇల్లెందురూరల్ : నిన్నా, మొన్నటి వరకు నీరు లేక వెలవెలబోయిన చెరువులు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు, వాగుల్లోకి భారీగా నీరు చేరుతోంది. దీంతో పలు చెరువులు అలుగు పోస్తుండగా, మరి కొన్ని పూర్తిస్థాయిలో నిండాయి. జిల్లాలో మొత్తం 2,364 చెరువులకు గాను 94 చెరువులు అలుగు పోస్తున్నాయి. 688 చెరువులు వంద శాతం, 675 చెరువుల్లోకి 75 శాతం, 645 చెరువుల్లో 50 శాతం మేర నీరు చేరడం విశేషం. పాల్వంచ మండలంలోని ఎర్రసాని చెరువు నిండగా, మందేరకలపాడు వద్ద రాళ్లవాగు పికప్ డ్యామ్, ఇల్లెందు మండలం తొడిదెలగూడెం చెరువు సైతం నిండి అలుగు పోస్తున్నాయి. మిట్టపల్లి వద్ద మసివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. అలాగే, పాల్వంచ మండలం జగన్నాథపురం, రంగాపురం, నాగారం, దంతలబోరు చెరువులు కళకళాడుతున్నాయి. కిన్నెరసాని వాగులో సోములగూడెం, సూరారం, నాగారం వద్ద నిర్మించిన చెక్ డ్యామ్‌లు పొంగిపొర్లుతున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే అన్ని చెరువులు నిండి అలుగు పోసే అవకాశముందని జలవనరుల శాఖ ఈఈ అర్జున్ తెలిపారు. కాగా, ఇప్పటికే వరినార్లు సిద్ధం చేసుకున్న రైతులు ఎడతెరిపి లేని వర్షంతో నాట్లు వేయించడంలో నిమగ్నమయ్యారు. వర్షం తెరపి ఇచ్చినప్పుడు పత్తి, మొక్కజొన్న చేలలో కలుపు నివారణ మందు పిచికారీ చేస్తున్నారు.

నిండు కుండల్లా చెరువులు