
సుమనోహరంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం సుమనోహరంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామివా రిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కాగా, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితారాణా గురువారం శ్రీ సీతా రామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు. కార్యక్రమంలో వేద పండితులు పద్మనాభ శర్మ, అర్చకులు రవికుమార్ శర్మ, ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రేపు ‘దిశ’ సర్వసభ్య సమావేశం
చుంచుపల్లి: జిల్లా అభివృద్ధి, సమన్వయ(దిశ) సర్వసభ్య సమావేశం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి కో – చైర్మన్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని వివరించారు. అన్ని శాఖల అధికారులు తమ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల నివేదికలతో సకాలంలో రావాలని సూచించారు.
కిన్నెరసాని నుంచి
నీటి విడుదల
పాల్వంచరూరల్ : జిల్లాతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కిన్నెరసాని జలాశయంలోకి భారీగా వరద చేరుతోంది. దీంతో ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. రిజర్వాయర్ సామర్థ్యం 407 అడుగులు కాగా, ఎగువ నుంచి గురువారం 4,800 క్యూసెక్కుల వరద నీరు రావడంతో నీటిమట్టం 404.30 అడుగులకు పెరిగింది.దీంతో ప్రాజెక్టు అధికారులు రాత్రి ఒక గేటు ఎత్తి 1000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
పౌరసేవల్లో
మీ సేవ కేంద్రాలే కీలకం
బూర్గంపాడు: పౌరసేవలు వేగవంతం చేయటంలో మీ సేవ కేంద్రాలే కీలకమని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. మోరంపల్లి బంజరలోని మీ సేవ కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, దరఖాస్తుల పరిష్కారం, సమయపాలన తదితర అంశాలను పరిశీలించారు. ఇటీవల ప్రభుత్వం మీ సేవ కేంద్రాల్లో కొత్తగా అమలు చేస్తున్న పౌరసేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారుల నుంచి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులే తీసుకోవాలన్నారు. మీ సేవ కేంద్రాల డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు పాల్గొన్నారు.

సుమనోహరంగా రామయ్య నిత్యకల్యాణం

సుమనోహరంగా రామయ్య నిత్యకల్యాణం