
గూడు లేక గోడు
● భ ద్రాచలంలో ఇంటి కోసం నిర్వాసితుల ఎదురుచూపులు ● ఆర్‌అండ్‌బీ స్థలంలో కొనసాగుతున్న పనులు ● మరో నెలకు పైగా సమయం పట్టే అవకాశం ● ప్యాకేజీ, స్థలం త్వరగా ఇవ్వాలంటున్న బాధితులు
భద్రాచలం: ఎన్నో ఏళ్లుగా ఉంటున్న గూడు చెదిరింది. రామాలయం అభివృద్ధి చెందితే అందరి బతుకులూ బాగుపడతాయని సరిపెట్టుకున్నారు. మాడ వీధుల విస్తరణ కోసం ఇళ్లు ఖాళీ చేయాలని, ప్రత్యామ్నాయ స్థలం చూపిస్తామని, ఇంటి నిర్మాణానికి ప్యాకేజీ కూడా ఇస్తామని అధికారులు చెప్పిన మాటలు నమ్మారు. ఆ వెంటనే పెట్టే బేడా సర్దుకొని కట్టుబట్టలతో ఇళ్లు, దుకాణాలు ఖాళీ చేశారు. కానీ అధికారుల హామీలు ఇంకా కార్యరూపం దాల్చకపోవడంతో అటు వ్యాపారాలు కోల్పోయి, ఇటు ఇంటి అద్దెలు చెల్లించలేక నిర్వాసితులు భారంగా జీవనం సాగిస్తున్నారు. జాగలెప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు.
ఖాళీ చేసి రెండు నెలలు..
భద్రాచలం రామాలయం అభివృద్ధిలో భాగంగా తొలుత మాడ వీధులను విస్తరించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకోసం రూ.60.20 కోట్ల నిధులు కేటాయించగా ఆలయానికి రెండు వైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నష్ట పరిహారం అందజేశారు. దీంతో ఆయా ఇళ్లలో వారు నిర్వహిస్తున్న బొమ్మల దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, ఇతర చిరు వ్యాపారాలను వదులుకుని రెండు నెలల క్రితం ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇంటికి సంబంధించిన నష్ట పరిహారం అందించగా.. ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి అవసరమైన ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కూడా అందిస్తామని రెవెన్యూ అధికారులు హమీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు జాగా కానీ, ప్యాకేజీ కానీ అందలేదు.
ఇప్పట్లో కానట్టేనా..?
స్థానిక బ్రిడ్జి రోడ్డులో ఉన్న ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్, డివిజన్ కార్యాలయాలను తొలగించి ఆ స్థలాన్ని నిర్వాసితులకు అందించాలని అధికారులు నిర్ణయించారు. నెల క్రితమే స్థలం చదును చేసే పనులు ప్రారంభించారు. మట్టి దిబ్బలు ఉండగా వారం రోజుల్లో పనులు పూర్తి చేసి అందించాలని భావించారు. అయితే పనులు ప్రారంభించాక సీన్ రివర్సయింది. ఆ మట్టి దిబ్బల కింద గట్టి రాళ్లు గుట్టలుగా ఉన్నాయి. దీంతో భారీ క్రేన్లు, జేసీబీల సాయంతో ఆ రాళ్ల గుట్టలను తొలగిస్తున్నారు. తవ్వే కొద్దీ బండలు బయట పడుతున్నాయి. దీంతో మరో నెల రోజులకు పైగా ఈ పనులు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో నిర్వాసితులకు మరి కొన్ని రోజులు ఎదురుచూపులు తప్పవని తెలుస్తోంది.
లాటరీలో 90 గజాల కేటాయింపు...?
ఆర్‌అండ్‌బీ స్థలంలో కొద్దిమేర నిర్వాసితులకు ఇవ్వాలని గతంలో నిర్ణయించిన అధికారులు.. ఆ తర్వాత మరి కొంత పెంచి ఇవ్వాలని భావించారు. ఇందుకు సుమారు మూడెకరాలు అవసరమని తేల్చారు. దీన్ని 40 మంది నిర్వాసితులకు అందజేస్తే ఒక్కొక్కరికి 90 గజాల స్థలం వచ్చే అవకాశం ఉంది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ స్థలం చాలా విలువైనదిగా భావిస్తున్న నిర్వాసితులు సైతం ఈ స్థలం వైపే మొగ్గు చూపారు. కాగా, స్థలాన్ని పూర్తిగా చదును చేశాక ఇందులోనే రోడ్లు, డ్రెయినేజీలకు కొంత కేటాయించి మిగితా భూమిని లాటరీ ద్వారా అందజేయనున్నారని తెలిసింది. ఆ తర్వాత యూనిట్ల వారీగా ఇంటి నిర్మాణానికి ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వనున్నారు.
త్వరలోనే స్థలం అప్పగిస్తాం
రామాలయ అభివృద్ధికి ఇంటి స్థలాలు ఇచ్చిన నిర్వాసితులకు త్వరలోనే ఆర్‌అండ్‌బీ స్థలం అప్పగిస్తాం. ఇప్పటికే ఈ పనులు పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ ఆ స్థలంలో రాళ్ల గుట్టలు ఉండగా, వాటి తొలగింపుతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. పూర్తిగా చదును చేశాక లాటరీ ద్వారా స్థలం అందించి ఇంటి నిర్మాణానికి ప్యాకేజీ కూడా ఇస్తాం.
– కొల్లు దామోదర్ రావు, భద్రాచలం ఆర్డీఓ

గూడు లేక గోడు