
యువత క్రీడల్లో రాణించాలి
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెంటౌన్: యువత క్రీడల వైపు మొగ్గు చూపడం అభినందనీయమని, భవిష్యత్‌లో మరింతగా రాణించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈ నెల 25,26,27 తేదీల్లో హైదరాబాద్‌లోని షేక్‌పేట గ్రౌండ్‌లో రాష్ట్రస్థాయి అండర్–14 బాక్సింగ్ స్టేట్ మీట్ నిర్వహించనున్నారు. జిల్లా నుంచి ఈ పోటీలకు వెళ్లే క్రీడాకారులు, జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి గురువారం కొత్తగూడెంలో ఎమ్మెల్యేను కలిశారు. ఎమ్మెల్యే వారికి టీ షర్ట్‌లను పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లా యువజన క్రీడలశాఖ అధికారి ఎం.పరంధామరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, వాసిరెడ్డి మురళి, తోటరాజు, బాక్సింగ్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మట్టపర్తి రమేష్, కోచ్ ఆర్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కిసాన్ మోర్చా నిరసన
చుంచుపల్లి: కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. కలెక్టర్ ఆఫీస్ సాధారణ పరిపాలన అధికారి రామకృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు. సీతారామ కాలువకు ఇరువైపులా ఉన్న రైతులకు సాగునీళ్లు అందడం లేదని ఆరోపించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు చిలుకూరి రమేష్, ఏనుగు వెంకటరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు కేవీ రంగా కిరణ్, జంపన సీతారామరాజు, రంజిత్,రాపాక రమేష్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.
విచారణ చేపట్టాలి
ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ వేపలగడ్డతండా గ్రామంలో ధరావత్ రమేష్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని, ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరారు. గురువారం ఇల్లెందు సీఐ సురేష్‌ను కలిసి సమస్య విన్నవించారు. రమేష్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు పేర్కొంటున్నారని, కానీ ఘటనా స్థలంలో కనిపించిన దృశ్యాలు తమకు అనుమానం కలిగిస్తున్నాయని వివరించారు. స్పందించిన సీఐ సమగ్ర విచారణ చేపడుతామని హామీ ఇచ్చారు.
నవోదయలో ముగిసిన క్రీడాపోటీలు
కూసుమంచి: మండలంలోని పాలేరులో జవహర్ నవోదయ విద్యాలయలో నిర్వహిస్తున్న క్లస్టర్ స్థాయి స్పోర్ట్స్ మీట్ గురువారంతో ముగిసింది. ఇక్కడ ప్రతిభ చాటిన విద్యార్థులను త్వరలో జరగనున్న రీజినల్ పోటీలకు ఎంపిక చేశారు. క్లస్టర్ మీట్‌లో పాలేరు నవోదయ విద్యార్థులతో పాటు వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నవోద య విద్యాలయాల నుంచి 345 మంది విద్యార్థులు పాల్గొనగా వీరిలో 234 మంది రీజినల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్ 14, 17, 19 విభా గాల్లో బాలబాలికలకు బ్యాడ్మింటన్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, చెస్, ఖో–ఖో, యోగా పోటీలు నిర్వహించగా పాలేరు, నల్లగొండ విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్‌తో పాటు వివిధ క్రీడల్లో సత్తా చాటారు. కాగా, రీజినల్ స్థాయి పోటీల్లో భాగంగా కరీంనగర్‌లో ఖో–ఖో, కాకినాడలో కబడ్డీ, కేరళలో బ్యాడ్మింటన్, కర్ణాటకలో చెస్, తూర్పుగోదావరిలో టెబుల్ టెన్నిస్, గుంటూరులో యోగా పోటీలు జరుగుతాయని పాలేరు ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసులు తెలిపారు.
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడుకు చెందిన మేడ శ్రీను(59) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండగా, కొద్దిరోజులుగా గొడవులు జరుగుతుండడంతో మనస్తాపానికి గురయ్యాడు. ఈమేరకు బుధవారం రాత్రి ఇంట్లో గడ్డి మందు తాగిన శ్రీనును ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఆయన కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

యువత క్రీడల్లో రాణించాలి

యువత క్రీడల్లో రాణించాలి