
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక
పాల్వంచరూరల్: కిన్నెరసాని స్పోర్ట్స్ పాఠశాలలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి 600 మంది క్రీడాకారులు హాజరుకాగా, డీవైఎస్‌ఓ పరంధామరెడ్డి పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో ప్రతిభ చూపిన 40 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఆగస్టు 3న హన్మకొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నారు. డీవైఎస్‌ఓ విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేసి మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ చూపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ జి.యుంగధర్‌రెడ్డి, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.మహిధర్, అధ్యక్షుడు గొట్టపు రాధాకృష్ణ, ఎస్‌ఐ సురేష్, పూనెం కృష్ణదొర, పి.నాగేందర్, రామారావు, వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
తడిసిన మైదానంలోనే..
వర్షం కురుస్తుండటంతో క్రీడా మైదానం తడిసిపోయి జారి కిందపడే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు నిలిచింది. అయినా అథ్లెటిక్స్ నిర్వాహకులు పట్టించుకోకుండా పోటీలు కొనసాగించారు. దీంతో ఇద్దరు క్రీడాకారులు పరిగెత్తుతూ జారి కిందపడగా, స్వల్ప గాయాలయ్యాయి.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌కు ఎంపిక