
ఊపందుకుంటున్న ‘సాగు’
● లోటు వర్షపాతం నుంచి గట్టెక్కిన జిల్లా ● 16 మండలాల్లో సాధారణం, ఏడు మండలాల్లో అధికం
సూపర్‌బజార్(కొత్తగూడెం): లోటు వర్షపాతం నుంచి జిల్లా గట్టెక్కింది. రెండు రోజుల క్రితం వరకు అంతగా వర్షాలు లేక వ్యవసాయ పనులు మందకొడిగా సాగగా.. ప్రస్తుతం ఊపందుకున్నాయి. దీంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత వర్షాలతో పత్తి మొక్కలు జీవం పోసుకుంటుండగా వరినాట్లు ముమ్మరమయ్యాయి. గురువారం నాటికి జిల్లాలోని 16 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదు కాగా, మరో ఏడు మండలాల్లో అధిక వర్షం కురిసింది.
వర్షపాతం వివరాలిలా..
జిల్లాలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 446.2 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 413.1 మి.మీ వర్షపాతం నమోదైంది. చర్ల, మణుగూరు, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, పాల్వంచ, అశ్వారావుపేట మండలాల్లో అధిక వర్షం కురవగా, కరకగూడెం, పినపాక, దుమ్ముగూడెం, అశ్వాపురం, ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపాడు, భద్రాచలం, ములకలపల్లి, దమ్మపేట మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో వివిధ పంటల సాధారణ విస్తీర్ణం 4,50,512 ఎకరాలుగా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో ఇంకా 1,38,725 ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉంది.