
గుర్తు తెలియని వ్యక్తుల దాడి
చర్ల: మండలంలోని క్రాంతిపురంలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన గిరిజనుడు భద్రాచలం వైద్యశాలకు తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. అతని భార్యను కూడా హతమార్చేందుకు యత్నించగా ఆమె తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. మండలంలోని కొయ్యూరు గ్రామ పంచాయతీ వలస ఆదివాసీ గ్రామం క్రాంతిపురానికి చెందిన మడకం భద్రయ్య (40) ఇంటికి బుధవారం రాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. కత్తులు, గొడ్డళ్లతో దాడి చేయడంతో తీవ్ర గాయాలై భద్రయ్య కుప్పకూలిపోయాడు. అతని భార్య లక్ష్మి కేకలు వేయగా, ఆమెను కూడా హతమార్చేందుకు యత్నించారు. దీంతో తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది. గ్రామస్తులు క్షతగాత్రుడిని కొయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు, అక్కడి నుంచి భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సీఐ రాజువర్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామంలో డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో తనిఖీలు నిర్వహించారు. కాగా క్రాంతిపురంలో గడిచిన ఐదేళ్ల కాలంలో మూడు హత్యలు జరిగాయి. పోలీసులు దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వలస ఆదివాసీ గిరిజనుడి మృతి