
దంత సేవలు అంతంతే...
● ఖమ్మం పెద్దాస్పత్రిలో వేధిస్తున్న పరికరాల కొరత ● సరైన సేవలు అందక ‘ప్రైవేట్’కు బాధితులు ● గత ఏడాది మొత్తం 4,873 మందికే సాధారణ సేవలు
ఖమ్మంవైద్యవిభాగం: మానవ శరీరంలో అన్ని అవయవాల మాదిరిగానే దంతాలకు సైతం సమస్యలు వస్తుంటాయి. అయితే, దంత సమస్యలు త్వరగా నయం కావు. ఇందుకోసం వివిధ దశల్లో చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. అలా జరగకపోతే ఇతర శారీరక సమస్యలు వచ్చే ప్రమాదముంది. ప్రధానంగా పరిశుభ్రత పాటించకపోతే దంత సమస్యలు వచ్చే అవకాశముండగా... ఖమ్మం జిల్లాలో దంత సమస్యతో బాధపడే వారికి ప్రభుత్వపరంగా మెరుగైన వైద్యం అందడం లేదు. ఖమ్మంలోని పెద్దాస్పత్రి దంత విభాగానికి నిరుపేదలే వస్తుండగా, వారికి నామమాత్రపు సేవలతోనే సరిపెడుతున్నారు. దీంతో పలువురు తప్పనిసరై ప్రైవేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు.
రోజుకు వంద మందికి పైగానే..
వయస్సుతో సంబంధం లేకుండా ఇటీవల దంత సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. పెద్దాస్పత్రిలో ఓపీకి నిత్యం వివిధ సమస్యలతో 1,500మందికి వస్తుండగా, దంత సంబంధిత చికిత్స కోసం వచ్చే వారి సంఖ్య వందకు పైగానే ఉంటుంది. కానీ ఇక్కడ సాధారణ చికిత్సలే తప్ప మెరుగైన వైద్యం అందకపోవడంతో నానాటికీ ఓపీ తగ్గుతోంది. గత ఏడాది మొత్తంగా పెద్దాస్పత్రిలోని దంత విభాగంలో 4,873 మందికే సేవలు అందా యి. ఆధునిక పరికరాలు లేకపోవడంతో పళ్లు తొలగించడం, కొత్తవి అమర్చడం వంటి మైనర్ చికిత్సలే జరుగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల చికిత్సకు ఉపయోగించే కుర్చీ పాడవడంతో సేవలు మరింత మృగ్యమయ్యాయి.
ఓపీ సేవలతోనే సరి
పెద్దాస్పత్రిలోని దంత విభాగంలో అన్ని రకాల సేవలు అందక ఓపీ సేవలతో సరిపెడుతున్నారు. ఈ వి భాగంలో రూట్‌కెనాల్, డీప్ క్లీనింగ్,దంతాల ఫిల్లింగ్, కాస్మోటిక్స్ తదితర చికిత్స అందించాల్సి ఉంటుంది. కానీ అందుకుసంబంధించి పరికరాలు సమకూర్చక.. నిపుణులైన వైద్యులు లేకపోవడంతో పెద్దాస్పత్రికి వచ్చేవారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. దంత విభాగంలో ప్రస్తుతం ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రమే ఉన్నారు. ఇక చైర్, మౌత్ మిర్రర్, డిజిటల్ ఎక్స్‌రే,ప్రొబ్, ఓరల్ కెమెరా, అల్ట్రాసోనిక్ స్కేలర్, పా లిషింగ్ బ్రష్ తదితర పరికరాలు లేకపోవడం.. చైర్ కూడా పాడవడంతో సేవలు నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారాయి. సమస్యలతో వచ్చే వారితో మా ట్లాడి నొప్పి నివారణ మాత్రలు రాసి పంపిస్తుండడంతో 10 – 15 మందికి మంచి రావడం లేదు. అన్ని పరి కరాలు సమకూర్చి ఎండీ స్థాయి వైద్యుడికి కేటాయిస్తే పేదలకు మెరుగైన వైద్యంఅందనున్నందున అధికారులు స్పందించాలని పలువురు కోరుతున్నారు.
ఈ ఏడాది ఓపీ వివరాలు
నెల సంఖ్య
జనవరి 404
ఫిబ్రవరి 401
మార్చి 545
ఏప్రిల్ 357
మే 456
జూన్ 397
జూలై (ఇప్పటివరకు) 263
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం...
దంత సేవలు అందించే చైర్ పాడైన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో దీన్ని మరమ్మతు చేయించడమా కొత్తది కొనాలో నిర్ణయిస్తాం. ప్రస్తుతం సాధారణ చికిత్సలే అందుతున్నా, ఆధునిక పరికరాలు తెప్పించి మిగతా చికిత్సలు చేస్తాం. ఎండీ స్థాయి వైద్యుడిని కేటాయిస్తే శస్త్రచికిత్సలు అందించే అవకాశం ఉంటుంది.
– డాక్టర్ నరేందర్, ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్

దంత సేవలు అంతంతే...