
ఊపందుకోనున్న వరినాట్లు
బూర్గంపాడు: జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. వర్షాభావంతో ఈ నెల మొదటివారం నుంచి ప్రారంభం కావాల్సిన వరినాట్లు ఆలస్యమయ్యాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులకు, కుంటలకు నీరు చేరుతోంది. దీంతో వరినాట్లు వేగం పుంజుకుంటున్నాయి. ఈ ఏడాది జిల్లాలో సుమారు 1.95 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేసే అంచనాలున్నాయి. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తుండటంతో ఈసారి అధిక సంఖ్యలో రైతులు ఽవరి సాగుకు సిద్ధమయ్యారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర రూ.69 పెంచింది. దీంతో క్వింటా ధాన్యం ధర రూ.2,369 చేరింది. రాష్ట్ర ప్రభుత్వ బోనస్‌తో కలిపి క్వింటా ధాన్యానికి రూ.2,869 ధర దక్కనుంది. దీంతో రైతులు సన్నరకం ధాన్యం సాగుకు మొగ్గు చూపుతున్నారు. జూన్ రెండో వారం నుంచి వరినార్లు పోసుకున్నారు. అడపాదడపా వర్షాలకు నార్లు మొలకెత్తినా, ఆ తర్వాత సరిపడా వర్షం లేకపోవడంతో వడబడ్డాయి. కొందరు రైతులు ట్యాంకర్లతో తడిపి నారు బతికించుకున్నారు. చెరువులు, కుంటలు, లిఫ్టిరిగేషన్ స్కీమ్‌లు, తాలిపేరు ప్రాజెక్ట్, ఇతర చిన్నతరహా ప్రాజెక్ట్‌ల కింద కూడా వరినాట్లు మొదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా ఒకేసారి వరినాట్లు ప్రారంభం కావటంతో కూలీల కొరత ఏర్పడుతోంది. స్థానికంగా ఉన్న కూలీలు సరిపోకపోవటంతో ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తీసుకొస్తున్నారు. బెంగాల్, బిహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కూలీలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వరినాటుకు వస్తున్నారు. కూలీలకు బాగా డిమాండ్ ఏర్పడగా, ధర పెంచుతున్నారు. గతేడాది ఎకరా వరినాటుకు రూ.4 వేల నుంచి రూ.4,500 వరకు చెల్లించారు. ప్రస్తుతం రూ. 5వేలు, అంతకు పైగానే చెల్లిస్తున్నారు. కొంత ఆలస్యమైనా వరినాట్లు పడుతుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా వర్షాలు
చెరువులు, కుంటల్లోకి చేరుతున్న నీరు