
వర్షాలు.. పత్తి చేలో జాగ్రత్తలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): మూడు రోజులుగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పత్తి పంట దెబ్బతినకుండా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ టి.భరత్ బుధవారం వివరించారు.
●పత్తి చేలో నీరు నిల్వకుండా కాలువలు ఏర్పాటు చేసి బయటకు పంపించాలి.
●ఈనెల 20 వరకు మాత్రమే పత్తి విత్తుకుని ఉండాలి. భూస్వభావాన్ని బట్టి తేలిక, మధ్యస్త భూముల్లో 30వ తేదీ వరకు అచ్చు వేసుకుని మొక్కల సంఖ్యను పెంచుకునేలా విత్తుకుంటే పత్తి దిగుబడి తగ్గదు.
●విత్తిన పది రోజుల్లో మొలక రాకపోతే మళ్లీ విత్తాలి. రెండు మొలకలు ఉన్నచోట ఒకటి తొలగించాలి.
●పత్తి పంటలో మొదట 45 నుంచి 60 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి.
●కలుపు నివారణకు పత్తి విత్తిన 24–48 గంటల లోపు ఎకరాకు 1.2 లీటర్ల పెండిమిథాలిన్ 30 శాతం లేదా 700 మి.లీ పెండిఇతాలిన్ 38.7 శాతం, సిఎస్ మందు 200 లీటర్ల నీటిని కలిపి నేలపై పిచికారీ చేయాలి. భూమిలో సరైన తేమ/పదును ఉన్నపుడు పిచికారీ చేస్తే గడ్డిమందు సమర్థంగా పనిచేసి 20 రోజుల వరకు కలుపు మొక్కలు లేకుండా చేస్తుంది.
●పత్తిచేను 15–20 రోజుల దశలో ఉన్నపుడు చేనులో సన్న ఆకుల గడ్డి (నాలుగు ఆకులు), వెడల్పుకు (2–3 ఆకులు) కలుపు నివారణకు క్వాజలోపాప్‌ఇథైల్‌లో 400 మి.లీ. లేదాప్రొపొక్విజీపాపిన్ 250 మి.లీ, పైరిథయోబ్యాక్ సోడియం 250 మి.లీ. లేదా పైరిథియోబ్యాక్ సోడియం 6 శాతంతో పాటు క్విజలోపాప్ ఇథైల్ 4 శాతం , ఎంఈసీ 500 మి.లీలను 200 లీటర్లలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి
●ఎకరానికి 110 కిలోల యూరియా, 150కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.
●భాస్వరం ఎరువు మొత్తాన్ని దుక్కిలో లేదా విత్తిన 15 రోజుల్లో వేసుకోవాలి.
●విత్తిన 20, 40, 60, 80 రోజుల్లో 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ కలిపి నాలుగు సార్లు వేసుకోవాలి. పైపాటుగా డీఏపీ లేదా కాంప్లెక్స్ (20.20.0.13) ఎరువును వాడకూడదు.
●పత్తిచేను బెట్ట లేదా అధిక వర్షాలకు గురైనప్పుడు పత్తి పెరుగుదలకు 19.19.19 లేదా 13:0:45 లాంటి పోషకాలను లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
●పత్తిచేనులో పత్తి మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతే వేరుకుళ్లుగా భావించి, నివారణకు కార్బండాజిమ్ 1 గ్రా. లేదా కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్ల చుట్టూ వేరు బాగా తడిచేలా పోయాలి.
●పత్తిలో మొదట 30–45 రోజుల్లో రసం పీల్చే పురుగుల నివారణకు ఎసిటీమిప్రిడ్ 0.2 గ్రా. లేదా థయోమిథక్సమ్ 0.2 గ్రా లేదా ఫెప్రోనిలో లీటరు నీటికి కలుపుకుని పిచికారీ చేయాలి.
కేవీకే సేద్య విభాగ శాస్త్రవేత్త డాక్టర్ భరత్