
పొలంలో వ్యవసాయ కూలీ మృతి
టేకులపల్లి: వరి పొలంలో గొర్రు కొడుతుండగా అకస్మాత్తుగా కుప్పకూలి వ్యవసాయ కూలీ మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... మండలంలోని బొమ్మనపల్లికి చెందిన కౌలు రైతు దొడ్ల శంకర్ యాదవ్ బుధవా రం తన వరిపొలంలో గొర్రు కొట్టేందుకు మంగ్యతండాకు చెందిన బాణోత్ వీరు (60)ను పిలిచాడు. గొర్రు కొడుతున్న క్రమంలో వీరు కుప్పకూలి కింద పడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే చికిత్స కోసం బొమ్మనపల్లికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని తన ఇంటివద్ద ఉంచి కౌలు రైతుమృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశా రు. ఘర్షణ వాతావరణ నెలకొనడంతో సమాచారం తెలుసుకున్న టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్‌ఐలు రాజేందర్, శ్రీకాంత్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. కాగా పోలీసులు వెళ్లాక పెద్ద మనుషులు చర్చించి మృతుడి కుటుంబానికి రూ.లక్ష పరి హారం ఇచ్చేలా ఒప్పందం చేసినట్లు సమాచారం.