
ఉప్పొంగిన వాగులు
సింగరేణికి నష్టం..
ఏకధాటిగా కురిసిన వర్షంతో సింగరేణి మణుగూరు ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంగళవారం 36 వేల టన్నులకు గాను 20 వేల టన్నులే ఉత్పత్తి చేయగా, బుధవారం 3 వేల టన్నులు మాత్రమే వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఓసీ–2లో చేరిన వరద నీటిని ఎత్తిపోసే పంపులు సైతం నీటమునిగాయి.
సాక్షి నెట్‌వర్క్ : జిల్లాలో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం మొదలైన వానలు బుధవారం ఉదయం వరకూ కొనసాగాయి. జోరు వానలతో పలు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపైకి వరద నీరు రావడంతో అనేక గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా పినపాక నియోజవర్గంలో ఏకధాటిగా వర్షం కురవడంతో మణుగూరు పట్టణం జలదిగ్బంధం అయింది. మున్సిపాలిటీలో పరిధిలోని గాంధీనగర్, మేదరబస్తీ, సుందరయ్యనగర్, వినాయకనగర్ తదితర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఆయా కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. బుధవారం ఉదయం 8 గంటల వరకు మణుగూరులో 189 మి.మీ.వర్షపాతం నమోదైంది. గతేడాది ఆగస్టులో పట్టణం నీట మునగగా.. మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మేదరబస్తీ శివారు కృష్ణమందిర్ ఏరియాలో పలు నివాసాలు ముంపునకు గురి కాగా, ఇళ్లలోని ముఖ్య సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ఉదయం 11 గంటల తర్వాత వరుణుడు శాంతించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గాంధీనగర్, సుందరయ్యనగర్ శివారు మొట్టువాగు, కట్టువాగులు పొంగినప్పటికీ.. కట్టువాగు, మొట్టువాగు పూడికతీత పనులు కొంతమేర ముంపు ముప్పును తప్పించాయని స్థానికులు అంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఆర్డీఓ దామోదర్‌రావు, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, సీఐ నాగబాబు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు ఆయా కాలనీల్లో పర్యటించి సమస్యలపై ఆరా తీశారు.
నీటమునిగిన పంటలు..
వరుసగా రెండు రోజుల పాటు వర్షం కురవడంతో పలు చోట్ల పంటలు నీటమునిగాయి. ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్న వరితో పాటు మొలకెత్తిన పత్తి పంటల్లో అధికంగా నీరు చేరడంతో నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లిలో బూడిదవాడు ఉధృతంగా ప్రవహించడంతో దానిపై గల బ్రిడ్జి రహదారి కోతకు గురైంది. అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి భారీ వాహనాలు రాకుండా చర్యలు చేపట్టారు. పినపాక మండలం బయ్యారం పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. పినపాక – కరకగూడెం, బయ్యారం – మణుగూరు ప్రధాన రహదారిపై వరద ప్రవహిస్తోంది. జానంపేటలో పంటలు నీట మునిగాయి. తోగూడెం శివారులోని కల్వర్టు కోతకు గురికగా అధికారులు రాకపోకలు నిలిపేశారు. దుమ్ముగూడెం మండలంలో వర్షంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో పర్ణశాల, కాశీనగరం, సున్నంబట్టి, దుమ్ముగూడెం వద్ద గోదావరి పెరుగుతోంది. పర్ణశాలలో నారచీరల ప్రాంతంలోకి నీరు రాగా సీతమ్మవారి విగ్రహం సగం మేర మునిగిపోయింది. సున్నంబట్టి – బైరాగులపాడు, కాశీనగరం – చిన్ననల్లబల్లి గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం వాటిల్లింది. ఇల్లెందు మండలం రాఘబోయినగూడెం పెద్దచెరువు అలుగు పోసింది. అలుగుపై ఉన్న వంతెన మీదుగా వరదనీరు ప్రవహించడంతో పంచాయతీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు.
జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు
మణుగూరులో అత్యధికంగా 189 మి.మీ.వర్షపాతం
పలు ప్రాంతాల్లో నిలిచిన రాకపోకలు
బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

ఉప్పొంగిన వాగులు

ఉప్పొంగిన వాగులు