
ఖ్యాతి పెంచేలా ఎర్త్ సైన్సెస్
కొత్తగూడెంఅర్బన్ : ఖనిజ సంపదకు నిలయమైన జిల్లాలో తెలంగాణ ఖ్యాతిని పెంచేలా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ నిర్మిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇది ప్రపంచంలోనే మొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నిలుస్తుందని అన్నారు. యూనివర్సిటీలో ప్రవేశపెట్టాల్సిన కోర్సులు, మౌలిక వసతులు, భవనాల నిర్మాణం, నిధుల సమీకరణ తదితర అంశాలపై బుధవారం కొత్తగూడెంలోని యూనివర్సిటీ(ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ మైన్స్)లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే నెలలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ యూనివర్సిటీని ప్రారంభిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ పేరును ఈ యూనివర్సిటీకి పెట్టడం గర్వించదగిన విషయమన్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచే బీఎస్సీ, ఎమ్మెస్సీలో జువాలజీ, ఎన్విరాన్‌మెంటల్ కోర్సులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. విశ్వవిద్యాలయ నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలని, వివిధ దేశాల్లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను సందర్శించి, అక్కడి అనుభవాల ఆధారంగా మౌలిక సదుపాయాలు, కోర్సుల రూపకల్పన చేయాలని అన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపనకు అవసరమైన చర్యలు, కోర్సులు, విద్యార్థుల సంఖ్య వంటి అంశాలపై చర్చించామని తెలిపారు. జిల్లాలోని ఖనిజ వనరులను సమర్థవంతంగా వినియోగించేందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జియాలజీ, భూ విజ్ఞానానికి సంబంధించిన విశ్వవిద్యాలయాలు ఉన్నా, పూర్తిగా ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయం మాత్రం ఇదే మొదటిదని స్పష్టం చేశారు. యూనివర్సిటీకి మూడు సంవత్సరాల్లో శాశ్వత భవనాలు, అవసరమైన వసతులు కల్పిస్తామని, ఈ మేరకు నిధులు కేటాయించేలా సీఎం రేవంత్‌రెడ్డితో చర్చిస్తామని చెప్పారు.
మూడేళ్లలో మొత్తం కోర్సులు..
విద్యా శాఖ కార్యదర్శి యోగితారాణా మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు మొదలవుతాయని, రాబోయే మూడేళ్లలో అన్ని కోర్సులు అందుబాటులోకి తెస్తామని అన్నారు. భూమిపై అవగాహన, భూమికి సంబంధించి అన్ని పరిశోధనల కోర్సులతో విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. వివిధ దేశాల విశ్వవిద్యాలయాల సమన్వయంతో ఇక్కడి విద్యార్థులకు సౌకర్యాలు, వివిధ రకాల కోర్సులపై ప్రణాళిక రూపొందిస్తామని, ఇందుకోసం మూడు కమిటీలు ఏర్పాటు చేశామని తెలిపారు. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన మాట్లాడుతూ.. డాక్టర్ మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి పేరుతో ఏర్పాటైన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. శ్రీరాముడు కాలు మోపిన ఈ ప్రాంతంలో అద్భుత యూనివర్సిటీ స్థాపించడం సంతోషకమరని చెప్పారు. దేశంలోని వివిధ రంగాల్లో నిపుణులను కమిటీలో సభ్యులుగా చేర్చడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలతో పూర్తిస్థాయి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ స్థాపనకు కృషి చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభించడం జిల్లా అభివృద్ధికి శుభ పరిణామం అన్నారు. దేశంలోని విద్యార్థులు మెరుగైన ఉద్యోగావకాశాలు సాధించేందుకు ఈ విశ్వవిద్యాలయం తోడ్పడుతుందన్నారు. కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ ప్రపంచంలోనే జియోలాజికల్ మ్యూజియంగా జిల్లా ఉందని, అద్భుతమైన ఖనిజ సంపద, గోదావరి పరీవాహక ప్రాంతం ఉన్న ఈ జిల్లాలో ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ స్థాపనతో మారుమూల ప్రాంత విద్యార్థులకు ఎంతగానో ఉపయోగమని చెప్పారు. సమావేశంలో రాష్ట్ర ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి, కేయూ వీసీ ప్రొఫెసర్ ప్రతాప్‌రెడ్డి, అంబేడ్కర్ యూనివర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి, ఉన్నత విద్యామండలి సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్శిటీ ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ రామచంద్రం, రూసా ప్రతినిధి సౌందర్యజోసెఫ్ పాల్గొన్నారు.
మూడేళ్లలో పూర్తి స్థాయి యూనివర్సిటీ నిర్మాణం
ఆగస్టులో సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవం
ఈ విద్యా సంవత్సరం నుంచే యూజీ, పీజీ కోర్సులు ప్రారంభం
సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల, అధికారులు