
క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలి
బూర్గంపాడు: విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో చదవి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. బూర్గంపాడులోని గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను బుధవారం ఆమె సందర్శించారు. తరగతి గదులను పరిశీలించి వసతులు, ఇతర అవసరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అనంతరం బూర్గంపాడులోని కేజీబీవీని సందర్శించి రాత్రి అక్కడే బస చేశారు.
అటానమస్ కళాశాల సందర్శన..
పాల్వంచరూరల్ : మండలంలోని లక్ష్మీదేవిపల్లి ప్రభుత్వ డిగ్రీ అటానమస్ కళాశాలను యోగితారాణా సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ పద్మ, మాజీ ప్రిన్సిపాల్ చిన్నప్పయ్య, ఫ్యాకల్టీతో మాట్లాడారు. ఈ కళాశాల అటాన్‌మస్ స్థాయికి ఎలా చేరిందని అడిగి తెలుసుకున్నారు. అడ్మిషన్ల సంఖ్య పెంచేందుకు ఇంటింటి క్యాంపెయిన్ చేశామని, ఉత్తీర్ణ శాతం పెంపునకు కృషి చేస్తున్నామని, తమ విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి క్రీడల్లోనూ రాణిస్తున్నారని ప్రిన్సిపాల్ తదితరులు వివరించారు. జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలు దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆమె కమిషనర్ దేవసేనకు సూచించారు. అనంతరం ప్రిన్సిపాల్ పద్మను శాలువాతో సత్కరించారు.
విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా
దివ్యాంగ పిల్లలకు సదుపాయాలు కల్పించాలి..
కొత్తగూడెంఅర్బన్ : దివ్యాంగ పిల్లలకు పూర్తిస్థాయిలో సదుపాయాలు కల్పించాలని యోగితారాణా అన్నారు. కొత్తగూడెంలోని భవిత కేంద్రాన్ని సందర్శించి, దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలు సాధారణ విద్యార్థులతో సమానంగా చదివేలా ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం పిల్లలకు బహుమతులు అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ నికోలస్, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, ట్రెయినీ కలెక్టర్ సౌరభ్ శర్మ, రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్లు రాజీవ్, మదన్‌మోహన్, ఆర్‌జేడీ సత్యనారాయణ రెడ్డి, డీఈఓ వెంకటేశ్వరా చారి తదితరులు పాల్గొన్నారు.