
తృటిలో తప్పిన ప్రమాదం
టేకులపల్లి: చింతలతండా – గుండ్లమడుగు గ్రామాల మధ్య ఉన్న పుణ్యపు వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని మంగళవారం స్థానికులు రక్షించారు. వివరాలిలా ఉన్నాయి. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆర్టీసీ బస్సుతో పాటు ఇతర వాహనాలు నిలిచిపోయాయి. గుండ్లమడుగు గ్రామానికి చెందిన సర్ప శ్రీను కొత్తగూడెం వెళ్లేందుకు పుణ్యపు వాగు వద్దకు వచ్చి బస్సు ఎక్కాడు. కొంత సేపటికే అందరూ వద్దని వారిస్తున్నప్పటికీ బస్సు దిగి వాగు దాటుతున్న క్రమంలో అదుపుతప్పి కొట్టుకుపోయాడు. స్థానికులు వెతికి బయటకు తీసుకొచ్చారు. వారు సకాలంలో స్పందించకపోతే ప్రాణనష్టం జరిగి ఉండేది. కాగా, వాగులో పడటం వల్ల దెబ్బలు తగిలిన శ్రీనును బస్సులో కొత్తగూడెం తరలించారు.
యువతి అదృశ్యంపై కేసు
చండ్రుగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన యువతి కనిపించకుండా పోయిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివరామకృష్ణ మంగళవారం రాత్రి తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి (22) ఈ నెల 20 రాత్రి నుంచి కనిపించడం లేదు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
వాగులో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన స్థానికులు