
మెట్ట పంటలకు అనుకూలం..
● తేలికపాటి వానలతో ఆశాజనకంగా పత్తి, మొక్కజొన్న సాగు ● చెరువులు నిండకపోవటంతో వరినాట్లు ఆలస్యం
బూర్గంపాడు: ఈ సీజన్‌లో పడుతున్న తేలికపాటి వానలు మెట్ట పంటల సాగుకు అనుకూలంగా మారాయి. జిల్లాలో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసిన పత్తి, మొక్కజొన్న పంటలకు అడపాదడపా కురుస్తున్న వానలు కలిసివస్తున్నాయి. వానాకాలం ఆరంభమై రెండు నెలలు కావస్తున్నా భారీ వర్షాలు కురవకపోవటంతో చెరువులు, కుంటలు నిండలేదు. దీంతో వరినాట్లు ఆలస్యమవుతున్నా యి. రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో వరినాట్లు కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. భారీ వర్షాలు కురిస్తే వరినాట్లు కూడా ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సాధారణ వర్షపాతం..
ఈ ఏడాది జూన్‌లో జిల్లాలో కొన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం, మరికొన్ని మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది. రైతులు జూన్ ఆరంభం నుంచే మెట్టపంటల సాగుకు ఉపక్రమించారు. సుమారు 2.25 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది పత్తి సాగు చేస్తున్నారు. ఇప్పటికే 2 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రైతులు పత్తి వేశారు. జూన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పత్తి మొలకశాతం కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉంది. దీంతో రైతులు రెండో సారి పత్తి గింజలు వేసుకున్నారు. జూలైలో అడపాదడపా కురుస్తున్న తేలికపాటి వానలు పత్తిపంటకు జీవం పోశాయి. ప్రస్తుతం కురుస్తున్న వానలు పత్తికి మరింత అనుకూలంగా మారాయి. ప్రస్తుతం పత్తిచేలు అడుగు ఎత్తు పెరిగి ఆశాజనకంగా ఉన్నాయి. జూన్ మొదటివారంలో ముందుగా వేసిన పత్తి చేలు పూత దశకు చేరాయి. పత్తికి ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.589 మద్దతు ధరను పెంచింది. దీంతో క్వింటా పత్తి ధర రూ.8,100కు చేరింది. దీంతో జిల్లాలో అధిక విస్తీర్ణంలో పత్తిని సాగు చేశారు. అలాగే, 25 వేల ఎకరాల్లో సాగు చేసిన మొక్కజొన్న పంటకు కూడా జూలైలో కురిసిన వానలు ఊపిరి పోశాయి. పత్తి, మొక్కజొన్నల చేలల్లో కలుపు తీసి రైతులు తొలివిడత ఎరువులు వేసుకునే పనుల్లో నిమగ్నమయ్యారు. తేలికపాటి వానలతో కూరగాయల సాగు కూడా పెరగనుంది.
నిండని చెరువులు
ఇప్పటి వరకు జిల్లాలో భారీ వర్షాలు కురవకపోవటంతో చెరువులు, కుంటలు నిండలేదు. సరైన వానలు కురవక వరినార్లు కూడా ఒకనొక దశలో వడబడిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వారం రోజులుగా అడపాదడపా కురుస్తున్న వానలకు జిల్లాలో వరినాట్లు కూడా మొదలయ్యాయి. తుమ్మలచెరువు, టేకులచెరువు, దోమలవాగు చెరువు వంటి పెద్దచెరువులకు నీరు రాలేదు. దీంతో వరినాట్లు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రుతుపవనాలు బలపడటమో, అల్పపీడన ద్రోణి ప్రభావంతోనో జూలై చివరి వారం భారీ వర్షాలు కురిసి చెరువులు నిండితే పూర్తిస్థాయిలో వరినాట్లు పూర్తవుతాయి. భారీ వర్షాలు కురవకపోతే జిల్లాలో వరిసాగు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గోదావరి పరీవాహకంలో సాగు ఆలస్యం
ఏటా వరదల కారణంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సాగు ఆలస్యమవుతోంది. ఆగస్ట్‌లో గోదావరి వరదలు చూసిన తరువాత రైతులు పంటలు సాగు చేసుకుంటారు. మూడేళ్లుగా జూలైలోనే గోదావరికి వరద రావడంతో రైతులు సాగుకు భయపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు లేనికారణంగా ఇప్పటి వరకు గోదావరికి పెద్దగా వరద రాలేదు. ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాల కారణంగా పదిరోజుల కిందట గోదావరికి 40 అడుగుల మేర వరద చేరింది. రెండు రోజుల వ్యవధిలోనే వరద పూర్తిగా తగ్గింది. ఈసారి వరద రాకపోవచ్చని భావిస్తున్న కొందరు రైతులు సాగుకు ఉపక్రమిస్తున్నారు.
పత్తికి అనుకూలంగా ఉంది
ఈ ఏడాది కురుస్తున్న తేలికపాటి వానలు పత్తి పంటకు అనుకూలంగా ఉన్నాయి. అడపాదడపా కురుస్తున్న వర్షాలకు పత్తి ఏపుగా పెరుగుతోంది. తొలివిడత ఎరువులు వేయటం పూర్తయింది. మరో వారం రోజుల్లో రెండో విడత ఎరువులు వేస్తే పూతకు వస్తుంది.
–వై.వెంకట్రామిరెడ్డి, రైతు, రెడ్డిపాలెం

మెట్ట పంటలకు అనుకూలం..