
కళాశాలలకు మహర్దశ
● ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మరమ్మతులకు నిధులు ● మౌలిక వసతులు, క్రీడా సామగ్రి, ఇతర ఖర్చులకు రూ.3.31 కోట్లు విడుదల ● జిల్లాలో 14 కళాశాలలకు నిధులు
పాల్వంచరూరల్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు, మరమ్మతులు, అదనపు తరగతి గదులు లేక ఇబ్బందులు పడుతున్న తురణంలో ప్రభుత్వం కళాశాలల ప్రగతిపై దృష్టి సారించి నిధులు మంజూరు చేసింది. దీంతో జూనియర్ కాలేజీల్లో ఇక వసతులు మెరుగుపడనున్నాయి. జిల్లాలో మొత్తం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 14 ఉండగా ఇందులో చదువుకునే విద్యార్థులు ఐదు వేలకు పైగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం జిల్లాలో ని జూనియర్ కళాశాలలకు రూ.3,35,71,000 విడుదల చేయగా, అందులో మరమ్మతుల కోసం రూ. 3,31,15,000, మొయింటెన్స్ కోసం రూ.3.16 లక్షలు, క్రీడాసామగ్రి కోసం రూ.1.40లక్షలు కేటా యించినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి హెచ్.వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ప్రతి జూనియర్ కళాశాలకు రూ. 10వేల చొప్పున క్రీడా సామగ్రి కొనుగోలుకు కేటా యించారు.
కళాశాలలకు కేటాయించిన నిధులు..
కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల (జీజేసీ) కు రూ.58.50 లక్షలు కేటాయించారు. భద్రాచలం జీజేసీకి రూ.15.40 లక్షలు.. పాల్వంచ జీజేసీకి రూ. 13.34 లక్షలు, మణుగూరు జీజేసీకి రూ.16.84 లక్ష లు, అశ్వాపురం జీజేసీకి రూ.18.26 లక్షలు ఇల్లెందు జీజేసీకి రూ.37.34 లక్షలు, అశ్వారావు పేట జీజేసీకి రూ.9.41లక్షలు, చర్ల జీజేసీకి రూ. 22.90లక్షలు, బూర్గంపాడు జీజేసీకి రూ. 22.76 లక్షలు, పినపాక జీజేసీకి రూ.18.76 లక్షలు, గుండాల జీజేసీకి రూ.14.26 లక్షలు, టేకులపల్లి జీజేసీకి రూ.31.26 లక్షలు, దుమ్ముగూడెం, ములకపల్లి జీజేసీకి రూ.39.34 లక్షలు కేటాయించారు. కాగా, ప్రతి కళాశాలలో రూ.10 వేలు క్రీడా సామగ్రి కొనుగులుకు వినియోగించగా.. మిగిలిన డబ్బులను మెయింటెనెన్స్, మరమ్మతుల కోసం వినియోగించనున్నారు.
నిధులను సద్వినియోగం చేసుకోవాలి..
జిల్లాలోని 14 ప్రభుత్వ జూనియర్ కళాశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సద్వినియోగం చేసుకోవాలి. కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ ఆదేశాల మేరకు కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పంచాయతీ రాజ్ శాఖ, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో ఐటీడీఏ ఇంజనీరింగ్ విభాగాల పర్యవేక్షణలో పనులు నిర్వహిస్తారు.
–హెచ్.వెంకటేశ్వరరావు, డీఐఈఓ

కళాశాలలకు మహర్దశ