
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
● చదువుతో పాటు వారి ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలి ● ఉపాధ్యాయులకు ఐటీడీఏ పీఓ ఆదేశం
దుమ్ముగూడెం : విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠాలు బోధించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో చదువుతో పాటు వారి ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలన్నారు. మండలంలోని మంగువాయిబాడవ బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం ఆయన తనిఖీ చేసి, పాఠాలు బోధించారు. అనంతరం మాట్లాడుతూ.. మెనూ సక్రమంగా పాటించాలన్నారు. ఒకటి నుంచి ఏడో తరగతి విద్యార్థుల కోసం ఉద్దీపకం–2 వర్క్‌బుక్‌లు రూపొందించామని చెప్పారు. గతేడాది ప్రవేశపెట్టిన ఈ పుస్తకాలతో పిల్లల్లో సామర్థ్యం పెరిగిందని తెలిపారు. ప్రతీరోజు బోధించే పాఠ్యాంశాలతో పాటు అదనంగా ఒక పీరియడ్ విద్యార్థినులకు ఇష్టమైన వ్యాసరచన, క్విజ్, నాటికలు, ఏకపాత్రాభినయం, కుట్లు, అల్లికల వంటి వాటిపై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వాటికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించి అన్ని పాఠశాలలకు పంపిస్తామని తెలిపారు. పాఠశాల ఆవరణ శుభ్రంగా ఉండేలా చూడాలని, పిల్లలు ఎవరైనా అస్వస్థతకు గురైతే సమీపంలోని పీహెచ్‌సీకి తరలించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం వీరమ్మ, డిప్యూటీ వార్డెన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాలతో జీవనోపాధి
భద్రాచలంటౌన్: పోడు పట్టా కలిగిన గిరిజన రైతులకు ప్రధానమంత్రి జన జాతీయ గౌరవ ఉద్ధరణ అభియాన్ పథకం ద్వారా సబ్సిడీ రుణాలతో జీవనోపాధి కల్పించాలని పశుసంవర్థక శాఖ అధికారులను పీఓ రాహుల్ ఆదేశించారు. గిరిజన గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై మంగళవారం ఆయన వారితో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్ ద్వారా పోడు పట్టాలు పంపిణీ చేసిన గిరిజన రైతులకు ఈ పథకం వర్తింపజేయాలన్నారు. తద్వారా 90 శాతం సబ్సిడీతో గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం వంటి యూనిట్లు అందించాలన్నారు. దీనిపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. ఎంపీడీఓలు, గ్రామ కార్యదర్శులు కూడా గ్రామాల్లో ఈ పథకాలపై అవగాహన కల్పించాలని, ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా ప్రోత్సహించాలని అన్నారు. సమావేశంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఏడీ రవీంద్రనాథ్ ఠాగూర్ తదితరులు పాల్గొన్నారు.